60 వేల అప్పుకు లక్ష వడ్డీ.. ఆపై పిడిగుద్దులు - intrest
అవసరం కోసం వ్యాపారి దగ్గర అప్పు చేశాడో వ్యక్తి. తీసుకున్న సొమ్ముకు లక్షకు మించి వడ్డీ కట్టాడు. ఇక వడ్డీ చెల్లించటం తనవల్ల కాదని చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన వ్యాపారి చితకబాదాడు.
అప్పు తీసుకున్న వ్యక్తి వడ్డీ చెల్లించలేదని దారుణంగా కొట్టిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. రాణినగర్‌కు చెందిన వ్యక్తి ఓ వ్యాపారి వద్ద రూ.60 వేలు అప్పు చేశాడు. దీనికి వడ్డీ రూపంలో లక్ష రూపాయల వరకు చెల్లించాడు. ఇక వడ్డీ కట్టడం తన వల్ల కాదని వ్యాపారికి మొర పెట్టుకున్నాడు. దీంతో వ్యాపారి రెచ్చిపోయాడు. తన అనుచరులతో కలిసి వ్యక్తిని తీవ్రంగా కొట్టాడు. బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో అతని మిత్రులు అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది. దీనిపై ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సంబంధించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. వడ్డీ వ్యాపారస్తులు ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నారని.. అధిక వడ్డీల పేరుతో వేధిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.