తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓ మంత్రి కేంద్రంగా చేసుకుని ఆదాయపన్నుశాఖ పంజా విసరటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా సాగుతున్న ఈ సోదాలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలంరేపుతున్నాయి. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు అదే ప్రాంతంలో ఉండే ఆయన సోదరుడు గోపాల్‌రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, వియ్యంకుడు మర్రి లక్ష్మారెడ్డి ఇళ్లలో ఈ తనిఖీలు సాగుతున్నాయి.
విస్తృత తనిఖీలు... అదేవిధంగా... మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని మల్లారెడ్డి పెద్దకుమారుడు మహేందర్‌రెడ్డి, కొంపల్లిలో ఉండే చిన్నకుమారుడు భద్రారెడ్డి ఇంటిలో ఐటీశాఖ తనిఖీలు జరుపుతోంది. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ, కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల, సూరారంలోని మల్లారెడ్డి-నారాయణ ఆస్పత్రి, మల్లారెడ్డి వైద్య, దంత కళాశాలల్లో ఏకధాటిగా సోదాలు నిర్వహించారు. మల్లారెడ్డి సంస్థల డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఇళ్లలోనూ...ఐటీ దాడులు జరుగుతున్నాయి. మల్లారెడ్డి విద్యాసంస్థల లావాదేవీలతో సంబంధాలున్నాయనే సమాచారంతో.. క్రాంతి కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ రాజేశ్వరరావు నివాసంలో...సోదాలు నిర్వహించారు.
65 బృందాలు... హైదరాబాద్ రీజియన్‌తో పాటు ఒడిశా, కర్ణాటక రీజియన్ల నుంచి ఐటీ అధికారులను, సిబ్బందిని రప్పించి దాడుల్లో భాగస్వామ్యం చేశారు. 2 వందలకు పైగా అధికారులు, సిబ్బంది.... 65 బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తులు, ఐటీ రిటర్న్స్, చెల్లింపులపై..... ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. పన్ను చెల్లించని నగదు చలామణి అవుతున్నట్లు ప్రాధమికంగా గుర్తించి కేసు నమోదు చేసి... సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో సోదాలు జరిపి.... ఏ మేరకు ఆదాయం వస్తోంది.... ఎంత మొత్తానికి ఆదాయ పన్ను చెల్లించాలి...... ? ఇప్పుడు చెల్లిస్తున్నదెంత....? తదితర వివరాలను నిగ్గు తేల్చనున్నారు. ఐటీ వర్గాల సమాచారం మేరకు నగదు, బంగారం, కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో 4 కోట్లుతోపాటు ఇతర ప్రాంతాలల్లోనూ నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి.
రేపు కూడా జరిగే అవకాశం... ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లా రెడ్డి విద్యాసంస్థల్లో నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేసినట్లు గుర్తించారు. అదనంగా వసూలు చేసిన మొత్తాలను నగదు రూపంలో తీసుకున్నట్లు ఆధారాలు సేకరించినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. అనధికారికంగా, లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాలను స్థిరాస్థి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు, మల్లారెడ్డి-నారాయణ ఆస్పత్రి కోసం వెచ్చించినట్లు పేర్కొన్నారు. నిన్న, ఇవాళ రెండు రోజులు ఇప్పటి వరకు చేసిన సోదాలల్లో రూ.6 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సోదాలు మరికొన్ని చోట్ల రాత్రికి ముగిసే అవకాశం ఉండగా... ఇంకొన్ని చోట్ల రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా స్థిరాస్థులను కూడా వాస్తవ విలువ కాకుండా తక్కువ చూపినట్లు...ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్నారు. మల్లారెడ్డి వియంకుడు వర్ధమాన కళాశాలలో డైరెక్టర్‌గా ఉండడంతో ఆక్కడ సోదాలు చేసినట్లు వెల్లడించారు.