ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM Jagan ప్రభుత్వం అన్ని విధాలుగా పరిశ్రమలను ప్రోత్సహిస్తోందన్న సీఎం జగన్​ - అచ్యుతాపురంలో ఏటీసీ టైర్ల పరిశ్రమ

CM Jagan started ATC tires industry ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించినప్పుడే పేదరికం నుంచి బయటపడటంతో పాటు.. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్‌ అన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా పరిశ్రమలను ప్రోత్సహిస్తోందన్నారు. మూతపడిన ఎంఎస్‌ఎంఈలకు చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక అభివృద్ధికి అడుగులు వేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు.

CM Jagan
సీఎం జగన్​

By

Published : Aug 16, 2022, 2:19 PM IST

Updated : Aug 17, 2022, 6:26 AM IST

CM Jagan started ATC tires industry ‘రాష్ట్ర పారిశ్రామికరంగంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. పారిశ్రామికవేత్తల చేయిపట్టుకుని ప్రోత్సహిస్తున్నాం. గత మూడేళ్లుగా సులభతర వాణిజ్యంలో మనమే మొదటి స్థానంలో ఉన్నాం. ఇప్పుడు అంతా మన రాష్ట్రం వైపే చూస్తున్నారు’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో రూ.1,250 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన యొకహామా ఏటీసీ టైర్ల పరిశ్రమ మొదటిదశ యూనిట్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. అదే సంస్థ రెండోదశ విస్తరణ పనులకు భూమిపూజ, మరో 8 కంపెనీల ఏర్పాటుకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో మన రాష్ట్రం వైపు చూడనివారంతా ఇప్పుడు రావడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఈ మూడేళ్లలో రూ.39,350 కోట్ల పెట్టుబడితో 98 పరిశ్రమలను రాష్ట్రంలో ఏర్పాటు చేశారన్నారు. వీటిద్వారా 60,541 మందికి ఉపాధి చూపించామని వెల్లడించారు. రూ.8,285 కోట్ల పెట్టుబడితో 31,671 ఎంఎస్‌ఎంఈల ద్వారా 1.98 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు గుర్తుచేశారు. వచ్చే రెండేళ్లలో రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడితో 56 భారీ పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్నాయని, వాటిద్వారా 1.64 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

వచ్చే నెలలో అదానీ డాటా సెంటర్‌

‘గతంలో అదానీ, అదానీ అని పేరు మాత్రమే అనేవారు. ఆ సంస్థ ఎప్పుడూ రాష్ట్రంలో అడుగుపెట్టలేదు. జగన్‌ సీఎం అయిన తర్వాతే అదానీ ముందడుగు వేశారు. వచ్చే నెలలోనే అదానీ డాటా సెంటర్‌కు విశాఖపట్నంలో శ్రీకారం చుడుతున్నాం. మీరు బజాంకాస్‌ అనే పేరు విన్నారా? వాళ్లిప్పుడు వైయస్‌ఆర్‌ జిల్లా బద్వేలులో సెంచురీ ప్లైవుడ్‌ పరిశ్రమ పెడుతున్నారు. గతంలో బంగర్‌ల పేరు విన్నారా? వారు శ్రీ సిమెంట్‌ పరిశ్రమతో ముందుకొచ్చారు. గతంలో ఆదిత్యబిర్లా రాష్ట్రానికి ఎప్పుడైనా వచ్చారా? ఈరోజు వారు వచ్చి తమ ప్లాంటును ప్రారంభించారు’ అని జగన్‌ పేర్కొన్నారు.

సీఎం జగన్​

దేశం కంటే మన వృద్ధిరేటు ఎక్కువ

‘గత ఆర్థిక సంవత్సరంలో 11.43% జీఎస్‌డీపీ వృద్ధిరేటు సాధించాం. అదే జాతీయస్థాయిలో 8.9 శాతమే. గతేడాది 19.3 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు చేశాం. దేశ ఎగుమతుల్లో మన వాటా 4.58%. మన రాష్ట్రంలో నిర్మాణంలోని పోర్టులు అందుబాటులోకి వస్తే ఎగుమతుల విలువ 10% పెరిగే అవకాశం ఉంది. మూడు పారిశ్రామిక నడవాలున్న ఏకైక రాష్ట్రం మనదే. ఎంఎస్‌ఎంఈలకు గత మూడేళ్లలో రూ.1,463 కోట్లు ప్రోత్సాహకాలుగా ఇచ్చాం. వీటిద్వారా పది లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి సంతోషంగా రావాలి. ఏవైనా చిన్నచిన్న సమస్యలుంటే పెద్దవి కాకుండా పరిష్కరించుకోవాలి. మనవాళ్లు ఎలాంటి సమస్యలు సృష్టించరని వాళ్లు అనుకున్నప్పుడే రాష్ట్రంలోకి ఇంకా పెట్టుబడులు వస్తాయి’ అన్నారు. 75% స్థానికులకు ఉపాధి కల్పించేలా మన బాధ్యత ఉండాలన్నారు.

తొలుత పరిశ్రమలో టైర్ల ఉత్పత్తి యూనిట్‌ను సీఎం పరిశీలించారు. ఇక్కడ తయారైన ఓ టైరుపై సంతకం చేశారు. జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ టాగా మసయుకీ, కంపెనీ సీఈవో నితిన్‌, సీవోవో అనిల్‌గుప్తా ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, స్థానిక అధికారులు, నాయకుల సహకారం గురించి మాట్లాడారు. సీఎం జగన్‌తో జపాన్‌ సంప్రదాయ వస్త్రాన్ని ధరింపజేసి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి, ఎమ్మెల్యే రమణమూర్తిరాజు, కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి తదితరులు పాల్గొన్నారు.

రూ.3,202 కోట్లు.. 4,664 మందికి ఉపాధి

అచ్యుతాపురం సెజ్‌లో ఎనిమిది పరిశ్రమలకు సీఎం జగన్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. సెజ్‌, నాన్‌సెజ్‌ పరిధిలో 249.68 ఎకరాల్లో రూ.3,202 కోట్లతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటిద్వారా 4,664 మందికి ఉపాధి లభించనుందని అధికారులు ప్రకటించారు.

*18 ఎకరాల్లో రూ.202 కోట్లతో ఏర్పాటుచేసే మెస్సర్స్‌ పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. వాటర్‌ప్రూఫింగ్‌ ఉత్పత్తులు, కోటింగ్‌, సీలెంట్స్‌లను ఈ కంపెనీ తయారుచేస్తుంది.

*కార్బొనేటెడ్‌ ఫ్రూట్‌డ్రింక్స్‌, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌, ఫ్రూట్‌జ్యూస్‌ల టెట్రా ప్యాకింగ్‌, పెట్‌ బాటిల్స్‌కు బెవరేజెస్‌ తయారుచేసే మేఘ ఫ్రూట్‌ ప్రాసెసింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ యూనిట్‌ను ఆరు ఎకరాల్లో రూ.185.25 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు.

*మెస్సర్స్‌ ఐనాక్స్‌ ఎయిర్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీని 6.77 ఎకరాల్లో రూ.145 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. లిక్విడ్‌ ఆక్సిజన్‌, నైట్రోజన్‌ వంటి ఉత్పత్తులను ఇక్కడ తయారుచేస్తారు.

*మెస్సర్స్‌ ఆప్టిమస్‌ డ్రగ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 15.02 ఎకరాల్లో రూ.125 కోట్లతో కొత్త యూనిట్‌ పెడుతోంది.

*బల్క్‌డ్రగ్స్‌, ఇంటర్మీడియట్స్‌ తయారీ యూనిట్‌ అయిన సైనాప్టిక్స్‌ ల్యాబ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ని 11.67 ఎకరాల విస్తీర్ణంలో రూ.81.75 కోట్లతో ఏర్పాటుచేస్తున్నారు.

*కోక్‌, కోల్‌ స్క్రీనింగ్‌, గ్రేడింగ్‌ చేసే ఇషా రీసోర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ యూనిట్‌ను రూ.68.06 కోట్లతో 32.53 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు.

*స్టైయిరెక్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీని 4.08 ఎకరాల్లో ఏర్పాటుచేయనున్నారు.

గతంలో మూతపడిన పరిశ్రమకు ఇప్పుడు భూమి పూజ

అచ్యుతాపురం సెజ్‌లో మొదటిసారిగా ఏర్పాటుచేసిన డబ్ల్యూఎస్‌ కంపెనీ హుద్‌హుద్‌ తుపాను తర్వాత బీమా రాకపోవడంతో 2014లో మూసేశారు. విన్‌విన్‌ స్పెషాలిటీ కంపెనీ ఈ కంపెనీని కొని.. రూ.107.70 కోట్లతో దీన్ని పునరుద్ధరించడానికి ముందుకొచ్చింది. దీనికి సీఎం శంకుస్థాపన చేశారు.

.

"ఈజ్ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నాం. ప్రభుత్వం అన్ని విధాలుగా పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర జీడీపీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. పెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. 15 నెలల కాలంలోనే టైర్ల పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రభుత్వ సహకారంతో రెండో ఫేజ్‌కు ముందుకొచ్చారు. 2023 ఆగస్టు నాటికి రెండో ఫేజ్‌ పనులు పూర్తి చేస్తాం. మూడేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నంబర్‌ వన్‌ స్థానం ఏపీదే. మూతపడిన ఎంఎస్‌ఎంఈలకు చేయూతనిస్తాం. రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక అభివృద్ధికి అడుగులు వేస్తున్నాం."- సీఎం జగన్‌

ఇవీ చదవండి:

Last Updated : Aug 17, 2022, 6:26 AM IST

ABOUT THE AUTHOR

...view details