ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన్యం కుర్రాడి ఆలోచనతో.. అక్కకు తప్పిన పెట్రోలు​ కష్టాలు - ఎలక్ట్రికల్‌ స్కూటర్‌

Electric Vehicle : అదో కొండ కోనల మన్యం ప్రాంతం. అయినప్పటికీ నగరాలకు దీటుగా ఓ యువకుడు తన ఆలోచనలకు పదును పెట్టాడు. అక్క శ్రమకు పరిష్కారం చూపాలనుకున్న ఈ యువకుడు తన నైపుణ్యంతో పెట్రోల్ స్కూటర్‌ను.. ఎలక్ట్రిక్‌ వాహనంగా మార్చేశాడు. ఇంధన ఖర్చు తగ్గించాడు. తాను నేర్చుకున్న ఎలక్ట్రిక్‌ మెకానిక్‌తోనే పెట్రోల్‌ బండిని.. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్చానంటున్న సురేశ్‌.. అక్కపై తనకున్న ప్రేమ చాటుకొని పలువురి మన్ననలు అందుకుంటున్నాడు.

Petrol Scooter To Electric Vehicle
Petrol Scooter To Electric Vehicle

By

Published : Sep 13, 2022, 3:57 PM IST

అక్క కష్టం చూడలేక.. పెట్రోల్​ స్కూటర్​ను ఎలక్ట్రిక్‌ వాహనంగా మార్చిన తమ్ముడు

Petrol Scooter To Electric Vehicle : రోడ్లపై రయ్‌రయ్‌మంటూ తిరిగే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు చూసే ఉంటాం... వాటన్నింటికి ఇది భిన్నం. ఎందుకంటే.. దీనిని రూపొందించింది మన్యం కుర్రాడు. తన నైపుణ్యంతో పెట్రోల్‌ స్కూటర్‌నే ఎలక్ట్రికల్‌ స్కూటర్‌గా మార్చేశాడు. ఈ స్కూటర్‌ పెట్రోల్‌, ఎలక్ట్రిక్‌ రెండింటితోనూ నడిచేలా చేశాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి గ్రామానికి చెందిన సామన సురేశ్‌ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాడు. తర్వాత ఉద్యోగాల వెతుకులాటలో పడ్డాడు. చివరికి స్థానికంగా ఓ ఎలక్ట్రికల్ షాపులో ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు రిపేర్‌ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో మోటారు ఎలా పని చేస్తుంది? బ్యాటరీ పనితనం తదితర అంశాలను బాగా తెలుసుకున్నాడు.

సురేశ్‌ అక్క వెంకటలక్ష్మి రాజవొమ్మంగికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకరపాడు బ్రాంచ్‌ పోస్ట్‌ మాష్టరుగా విధులు నిర్వహిస్తోంది. ఆమె రోజూ స్కూటర్‌పై విధులకు వెళ్తోంది. ఘాట్‌ రోడ్డులో పెట్రోల్‌తో నడిచే ఈ స్కూటర్‌ మైలేజ్‌ లీటరుకు 30 కిలోమీటర్లే వస్తోంది. రోజూ 12 కిలోమీటర్ల దూరం వెళ్లి వచ్చేందుకు వంద రూపాయల వరకు ఖర్చయ్యేది. ఇలా నెలకు 3వేల వరకు ఖర్చయేదని.. ఇప్పుడు అది రూ.3వందలకే తగ్గిందని సురేశ్‌ అక్క చెబుతున్నారు.

అక్క సమస్య తెలుసుకున్న సురేశ్‌ తనకున్న పరిజ్ఞానంతో పరిష్కారం చూపించాలని అనుకున్నాడు. ఇందుకోసం అక్క స్కూటర్‌ను ఎలక్ట్రిక్‌ స్కూటర్‌గా మార్చాలని భావించాడు. అప్పటికే సురేశ్‌ బ్యాటరీతో నడిచే ఓ సైకిల్‌ తయారు చేసి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాడు. కానీ అక్కను సైకిల్‌పై పోస్టాఫీసుకు వెళ్లమనడం ఇష్టం లేక.. ఆమె ఉపయోగించే స్కూటర్‌కే బ్యాటరీలు అమర్చే పనిలో పడ్డాడు.

దాదాపు 2వారాల పాటు కష్టపడిన సురేశ్‌...కృషి ఫలితం లభించింది. సెల్‌ఫోన్‌ లానే బ్యాటరీ ఛార్జ్‌ చేస్తే సరిపోతుండటంతో అక్క వెంకటలక్ష్మి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ స్కూటర్‌పై 3 గంటలు ఛార్జ్‌ చేస్తే 60 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. పెట్రోల్‌ స్కూటర్‌ను బ్యాటరీ బండిలా మార్చడానికి రూ.28వేలు ఖర్చయినట్లు సురేశ్‌ చెబుతున్నారు.

ఈ బ్యాటరీ బైక్‌కు 12 ఓల్ట్స్‌ బ్యాటరీలు అమర్చారు. 3 గంటల ఛార్జింగ్‌కు 15 రూపాయలు ఖర్చు అవుతోంది. 60 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. పైకి పెట్రోల్‌ స్కూటర్‌ మాదిరిగా ఉన్న బ్యాటరీ స్కూటర్‌ను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అలాగే తమ స్కూటర్లు కూడా ఎలక్ట్రిక్‌ మార్పించుకుంటామని అంటున్నారు.

బీఎస్సీ చదువుకున్న సురేశ్‌ ఉపాధి నిమిత్తం ఎలక్ట్రికల్​ షాపులో పని చేస్తున్నప్పటికీ.. అందులో భిన్నమైన ప్రతిభను కనబరిచాడు.. భవిష్యత్తులోనూ ఇలాంటి ఎలక్ట్రిక్‌ వాహనాలను రూపొందించడానికి కృషి చేస్తానని చెబుతున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details