Tragedy in Alluri Sitaramaraju district: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెల పంచాయతీ తడక గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒకే కటుంబానికి చెందిన 9 మంది సభ్యులు.. కలుషిత మాంసాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో గమనించిన స్థానికులు.. 9 మందిని హూటాహూటిన గన్నేల ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ.. మీనాక్షి అనే ఐదేళ్ల చిన్నారి మృతి చెందగా, మిగిలినవారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, మెరుగైన చికిత్స నిమిత్తం వారిని విశాఖపట్టణానికి తరలిస్తామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లా గన్నెల పంచాయతీ తడక గ్రామానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు.. మంగళవారం రాత్రి మేక మాంసాన్ని వండుకొని తిన్నారు. అనంతరం ఆ మంసాన్ని తిన్న 9మంది కుటుంబ సభ్యులకు వాంతులు, విరేచనాలు కావడం మొదలయ్యాయి. వారిలో మీనాక్షి అనే ఐదేళ్ల చిన్నారికి వీరేచనాలు వెంటవెంటనే కావడంతో ఆ బాధను తట్టుకోలేక మృత్యువాత పడింది. దీంతో చుట్టుప్రక్కల వారు అప్రమత్తమై.. 108 వాహనానికి సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలోనే తడక గ్రామానికి చేరుకున్న అంబులెన్స్ (108).. గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యం నిమిత్తం తరలించింది. బాధితుల పరిస్థితిని పరీక్షించిన వైద్యులు.. చికిత్సను ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రస్తుతం బాధితులంతా ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే, వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో బంధువులు ఆవేదన చెందుతున్నారు.