పాడేరు ఘాట్‌లో రోడ్డు ప్రమాదం Road Accident In Paderu : పాడేరు ఘాట్‌రోడ్లో కారు అదుపు తప్పింది. కారు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. చనిపోయిన వారిలో భార్యాభర్తలు, డ్రైవర్ ఉన్నారు.
లోయలోకి దూసుకుపోయిన కారు :ఎస్ఐ లక్ష్మణరావు, స్థానికుల వివరాల ప్రకారం.. విశాఖలో ఎల్‌ఐసీ అదనపు డివిజన్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న సుబ్బారావు(55), వెంకట మహేశ్వరి (50) దంపతులు వారి సొంత గ్రామమమైన అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కిలగాడ గ్రామంలో జరిగిన గంగమ్మ దేవత ఉత్సవాలకు వెళ్లారు. మంగళవారం జాతర ముగియడంతో బుధవారం కారులో విశాఖకు తిరుగు ప్రయాణమయ్యారు. పాడేరు ఘాట్ రోడ్ ఏసుప్రభు కార్నర్ మలుపు సమీపంలో ఇన్నోవా కారు అదుపు తప్పింది. మూడు పల్టీలు వేసి 40 అడుగుల లోయలోకి దూసుకుపోయింది.
ఈ రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ విశాఖకు చెందిన కొడ్రాపు ఉమామహేశ్వరరెడ్డి(35), వెంకట మహేశ్వరి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సుబ్బారావు, సమరెడ్డి పూర్ణారావులను 108 వాహనంలో పాడేరు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. సుబ్బారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుబ్బారావుకు 2 రోజుల క్రితం డీఎంగా పదోన్నతి వచ్చింది. సుబ్బారావు, వెంకటమహేశ్వరి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
" కారు లోయలో పడి పోయింది. అక్కడ ఉన్న వారి సహాయంలో కారులో ఉన్న వారిని బయటకు తీశాము. స్పాట్లో ఇద్దరు చనిపోయారు. హాస్పిటల్లో ఒకరు చనిపోయారు. " - అంబులెన్స్ అధికారి
గంగమ్మ తల్లి జాతరకు వెళ్లిన దంపతులు : సుబ్బారావు, మహేశ్వరిలది అన్యోన్య దాంపత్యం. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఒకరు ఎంబీఏ, మరొకరు ఇంజినీరింగ్ చదువుతున్నారు. సుబ్బారావు ఎల్‌ఐసీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే ఆయనకు పదోన్నతి వచ్చింది. పదోన్నతిపై గురువారం ఒడిస్సా రాష్ట్రం బరంపూర్‌లో ఎల్ఐసీ డివిజనల్ మేనేజర్‌గా జాయిన్ అవ్వాల్సి ఉంది. ఇంతలో తమ సొంత గ్రామం ముంచంగిపుట్టు మండలం కిలగాడలో గంగమ్మ తల్లి జాతర వచ్చింది. కుటుంబసభ్యులు, సన్నిహితులు, గ్రామస్థులతో కలిసి గడపాలని, పదోన్నతి ఆనందాన్ని వారితో పంచుకోవాలని ఆనందంతో కారులో కిలగాడ వెళ్లారు. ఉత్సవాల్లో ఆనందంగా గడిపారు. ఇంతలో ఈ ప్రమాదం జరిగింది. కళ్లముందు కదలాడిన తీపి జ్ఞాపకాలన్నీ, మధుర క్షణాలు ఒక్కసారిగా చెల్లాచెదురై పోయాయి.
ఎవ్వరు ఊహించని విధంగా విషాదం :సుబ్బారావు కుటుంబ ఇలవేల్పు కిలగాడ గ్రామ దేవత గంగాలమ్మ తల్లి. ఆ దేవత వారి పూర్వీకుల ఇంటి వద్దే వెలసినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం పండగకు ముందు కుటుంబసభ్యులతో గ్రామానికి వెళ్లి జాతర నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండేవాడు. విరాళాలను విరివిగానే ఇస్తుండేవాడు. ఆధ్యాత్మిక భావాలు కల్గిన వ్యక్తిగా సుబ్బారావుకు మంచి పేరుంది. దీంతో గ్రామస్థులంతా ఆయన్ని ఎంతో గౌరవంగా చూసేవారు. ఈ సంవత్సరం జాతరకు వెళ్లారు. ఇటీవలే సుబ్బారావుకు పదోన్నతి రావడంతో బుధవారం గ్రామస్థులు, సన్నిహితులు ఆయన్ను సత్కరించారు. అందరికీ ధన్యవాదాలు చెప్పి భార్య మహేశ్వరితో కలసి కారులో విశాఖకు బయలుదేరారు. ఇంతలోనే ఎవ్వరు ఊహించని విధంగా విషాదం అలముకుంది.
ఇవీ చదవండి