Residents of Polavaram: పోలవరం విలీన మండలాల ప్రజలు.. ఎన్నడూ చూడని గోదావరి వరదతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. గోదారమ్మ ప్రవాహ ధాటికి కట్టుబట్టలతో మిగిలి బతకడమే భారంగా కాలం వెల్లదీస్తున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమను గాలికొదిలేసిందంటూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కూరుకుపోయారు. అల్లూరి జిల్లా కూనవరం మండలం కూనరాజువారిపేట గ్రామానికి చెందినవారు రోడ్డుకు ఇరువైపులా గుడారాలు వేసుకుని నివసిస్తున్నారు. గోదావరి మహోద్ధృతికి అన్నీ కోల్పోయి.. బతికితే చాలంటూ ఉన్న పలాన బయటికొచ్చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోగా.. కనీసం పలకరించే నాథుడే లేరంటూ.. సుమారు 150 కుటుంబాలు 10 రోజుల నుంచి ఏటిగట్టుపై గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు.
'పరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తే.. ఊళ్లొదిలి వెళ్లిపోతాం'
Peoples suffered with Flood: పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చిన తాము త్యాగధనులమని కొనియాడిన ప్రభుత్వం.. వరదతో చిన్నాభిన్నమైన తమను గాలికొదిలేయడం ఏంటని విలీన మండలాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ చూడని గోదావరి వరదను చూశామంటున్న బాధితులు.. కష్టాల్లో ఉన్న ప్రజలను పట్టించుకోని ఇంతటి చెత్త ప్రభుత్వాన్ని చూస్తున్నామని.. తీవ్రంగా మండిపడ్డారు. సర్కార్ ఆదుకుంటుందనే భరోసా తమకు లేదన్న స్థానికులు.. ప్రాజెక్టు కింద రావాల్సిన పరిహారం ఇస్తే తమ దారి తాము చూసుకుంటామని కుండబద్ధలు కొట్టారు.
ఎన్నికల ప్రచారంలో తమను త్యాగధనులమని కొనియాడిన జగన్.. ఇప్పుడు కనీసం తమవైపు ఎందుకు చూడటం లేదని బాధితులు నిలదీస్తున్నారు. జగన్‌ని నమ్ముకున్నందుకు తమకు ఏడుపే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి ఉగ్రరూపానికి అల్లూరి జిల్లా టేకులబర్రు గ్రామం.. పూర్తిగా ధ్వంసమైంది. ఇళ్లు నీట మునగగా.. అన్ని వస్తువులూ పాడై ఎందుకూ పనికిరాకుండా పోయాయి. దుకాణాల్లోని సామగ్రి, బయట ఉంచిన కార్లు, బైక్‌లు.. సర్వం మట్టికొట్టుకుపోయాయి. ఎన్నడూ చూడని వరదని చూశామంటున్న టేకులబర్రు గ్రామస్థులు.. ప్రస్తుత ప్రభుత్వం లాంటి చెత్త ప్రభుత్వాన్నీ ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. తమకివ్వాల్సిన పరిహారం ఇచ్చి, పునరావాసం కల్పిస్తే తామే ఊళ్లను ప్రభుత్వానికి అప్పగించి వెళ్లిపోతామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: