ఫేషియల్ యాప్‌తో ఎన్జీవోలు, ఉపాధ్యాయులకు ప్రాణసంకటం Danger with facial app: ఏ రోజుకారోజు ఉద్యోగులు, ఉపాధ్యాయులు విధులకు హాజరు కావడం దినదినగండం నూరేళ్ల ఆయుష్షులా మారింది. పాఠశాలలకు, కార్యాలయాలకు తమ విధులు నిర్వర్తించడానికి వెళ్లే ఉపాధ్యాయులు, ఉద్యోగులు ముప్పుతిప్పలు పడుతున్నారు. దూరభారమైనా సమయానికి వెళ్లినా ఫేషియల్ యాప్‌లో హాజరు వేయడంలో సమస్య తలెత్తుతోంది.
మరింత ఆందోళనలో ఎన్జీవోలు..: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సుమారు 5 వేల మందికి పైగా ఉద్యోగులు నిరంతరం రాకపోకలు సాగిస్తుంటారు.. అల్లూరి జిల్లా అయిన తర్వాత మారుమూల ప్రాంతాలకు వెళ్లే ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిరంతరం ప్రయాణం చేస్తున్నారు. కొందరు ద్విచక్ర వాహనాలపై మరికొందరు ఆర్టీసీ బస్సులపై మరికొందరు ప్రైవేటు జీపులపై ఆధారపడుతున్నారు. ఫేషియల్ యాప్ వచ్చిన తర్వాత వారు పాఠశాలలకు చేరేందుకు మరింత ఆందోళన పెరిగింది.
అవసరమైన ఆర్టీసీ బస్సులు సదుపాయాలు లేకపోవడంతో ఉద్యోగులు ఇక్కట్లు పడుతున్నారు. పాడేరు డిపో మొత్తానికి 35 బస్సులు మాత్రమే ఉన్నాయి. పాడేరు నుంచి చింతపల్లి వైపు అరకులోయ వైపు ముంచింగి పుట్టు వైపు మూడు ప్రధాన రహదారుల్లో వేలాది కుగ్రామలు ఉన్నాయి. అక్కడికి వెళ్లాలంటే నిత్యం సాహసం చేయాల్సి వస్తోంది ఉద్యోగులు వాపోతున్నారు.
బస్సుల కొరత..: ఏదోరకంగా చేరుదామంటే బస్సులు సకాలంలో ఉండవు. ఈ మూడు ప్రాంతాలకి ప్రతి అరగంటకి ఒక బస్సు ఉంటే అందరికీ సౌలభ్యంగా ఉంటుంది. అయినప్పటికీ ఆ చర్యలు లేవు. దీంతో ప్రతి రెండు గంటలకు ఒక సర్వీస్ వెళ్లిన బస్సులో తిరిగి రావడంతో సకాలంలో వెళ్లలేకపోతున్నారు. దీంతో ప్రైవేటు వాహనాలు ఆశ్రయించి ప్రమాదాలు గురవుతున్నారు. రెండు రోజుల కిందట జయలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు జీపు ప్రమాదంలో మృతి చెందారు.
జీతాలు నిలుపుదల!..: ఫేషియల్ యాప్ వచ్చిన తర్వాత ఉదయం 9 గంటల కల్లా పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలి. అలా కాకుంటే వారి జీతాలు నిలుపుదల చేస్తారన్న భయంతో నిత్యం ప్రయాణం చేస్తున్నారు. అడపాదడపా ప్రమాదాలకు గురై కొన్ని సందర్భాల్లో ద్విచక్ర వాహనదారులకు కాళ్లు, చేతులు విరిగిపోతున్నాయి. కొందరు ప్రమాదబారిన పడుతున్నారు. పాడేరు డిపో వద్ద 6-8 గంటల మధ్య ఉదయపు వేళల్లో బస్సుల కోసం.. ఇతర ప్రయాణాల సాధనాల కోసం నిత్యం పరుగులు తీస్తూనే ఉన్నారు..
పాడేరు డిపోలో సరిపడినన్ని బస్సులు లేకపోవడంతోనే సర్వీసులు వేయలేకపోతున్నారు.
ఇప్పటికైనా..: ఆర్టీసీ, ఇతర జిల్లా అధికారులు స్పందించి ఫేషియల్ యాప్‌ను దృష్టిలో ఉంచుకుని పాడేరు నుంచి ఈ మూడు ప్రాంతాల వైపు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు..
సమయానికి ఫేషియల్ యాప్‌లో హాజరు నమోదు కారణంగా ఉద్యోగులంతా తప్పని పరిస్థితిలో జీపులో ఎక్కడం జరుగుతుంది. దీని ద్వారా డ్రైవర్లు ఓవర్ లోడ్ అలాగే ఓవర్ స్పీడ్‌తో వెళ్లడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా డిపో సిబ్బంది ఒకసారి ఉద్యోగుల బాధలను అర్థం చేసుకుని సరైన సమయానికి బస్సులు వేయాల్సిందిగా కోరుతున్నాం- ఉద్యోగి
ఇవీ చదవండి