Do Not Include Boya and Valmiki In ST List : బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలుపుతూ రాష్ట్ర ప్రభత్వం తీసుకున్న తీర్మానం దారుణమని మాజీ ఎమ్మెల్యే, జాతీయ ఆదివాసీ అఖిలపక్ష జేఏసీ అధ్యక్షుడు లింగయ్య దొర మండి పడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో లింగయ్య దొర పర్యటించారు. ఆదివాసీలను ఓట్ల కోసమే రాజకీయ నేతలు వాడుకుంటున్నారే తప్ప, వారి సంక్షేమ ప్రయోజనాలు పట్టించుకోవడం లేదని ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీలకు అతీతంగా పోరాటం.. జాతీయ స్థాయిలో ఉద్యమం :బోయ, వాల్మీకులను ఎస్టీజాబితాలో కలపడం ఆదివాసీలకు తీరని నష్టమని లింగయ్య దొర అన్నారు.ఈ తీర్మానానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమై పోరాటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో ఉద్యమానికి పిలుపు ఇస్తామని అన్నారు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుతో సంప్రదించి గిరిజన ప్రాంతాల్లో గిరిజనులే ఉద్యోగాలు చేసే జీవో తీసుకొచ్చామని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మౌనంగా ఉండడం వల్లనే జీవో నెంబర్ 3 లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బోయ, వాల్మీకులను ఎస్టీల్లో కలపడం చట్ట ఉల్లంఘన :బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజారావు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గిరిజనులకు ఉపయోగపడే చట్టాలను మరిచి రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలు చేస్తున్నారని, అధిక సంఖ్యలో బోయ, వాల్మీకులను ఎస్టీల్లో కలపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది చట్ట ఉల్లంఘన అవుతుందని రాజారావు అన్నారు.