సింధూకే ఎందుకు ఈ ఆఫర్?
కరోలినా మారీన్, సైనా నెహ్వాల్ లాంటి స్టార్ క్రీడాకారిణులకు దక్కని అవకాశం సింధుకు దక్కింది.
మనదేశంలో ఒక్కసారి గుర్తింపు తెచ్చుకుంటే చాలు పేరుకు పేరు, డబ్బుకు డబ్బు... అందులోనూ ఏ క్రికెటర్లో, హీరోలో అయితే క్రేజ్ మరీ ఎక్కువ. కార్పొరేట్ కంపెనీలైతే కోట్ల రూపాయలు వెచ్చించి తమ బ్రాండ్ల ప్రచారానికి క్యూలు కడతాయి. ఇలాంటి అవకాశం మన తెలుగమ్మాయి పీవీ సింధుకు వచ్చింది. చైనాకు చెందిన 'లీ నింగ్' అనే సంస్థ ఆమెతో 50 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
దేశంలోనే కాదు... ప్రపంచంలోనే ఓ షట్లర్‌కు ఇంత మొత్తం ఇవ్వడం ఇదే తొలిసారి. నాలుగేళ్ల కాలపరిమితి కోసం సంతకం చేసిన సింధుకు ఈ ఒప్పందంతో ఏడాదికి రూ.12.5 కోట్ల ఆదాయం వస్తుంది. చాలాకాలం నెం.1 ర్యాంకర్లుగా కొనసాగిన కరోలినా మారీన్, సైనా నెహ్వాల్ లాంటి స్టార్ క్రీడాకారిణులకు దక్కని అవకాశం సింధుకు దక్కింది.
ఆమెకే ఎందుకు?
2014-15లో 'లీ నింగ్' సంస్థకు ప్రచారకర్తగా పనిచేసింది సింధు. అప్పుడు కోటిన్నరకే ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానంగా భారత మార్కెట్‌పై దృష్టి పెట్టిన చైనా సంస్థ సింధు లాంటి స్టార్ షట్లర్‌తో తమ స్పోర్ట్స్ బ్రాండ్లను ప్రచారం చేయించుకోవాలని చూస్తోంది.
2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించినప్పటి నుంచి నిలకడగా రాణిస్తుంది సింధు. కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలోనూ త్రుటిలో పసిడిని చేజార్చుకుని వెండి పతకాలు గెల్చుకుంది.
సింధుతోపాటు పారుపల్లి కశ్యప్‌కు రెండేళ్ల కాలానికి రూ. 8 కోట్లు.. మను అత్రి, సుమిత్ రెడ్డి జోడీతోనూ రెండేళ్ల కాలానికే రూ. 4 కోట్లకు ఒప్పందం చేసుకుంది. ఇటీవలే ఈ సంస్థ కిదాంబి శ్రీకాంత్‌తోనూ రూ. 35కోట్ల కాంట్రాక్ట్ కుదుర్చుకుంది.