తెలంగాణలోని వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఓ మహిళ హత్య కేసుకి సంబంధించి.. వర్ధన్నపేట పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అక్క భర్తే హంతకుడని తేలినా.. కేసుకు మరో నలుగురితో సంబంధముందని ఏసీపీ రమేశ్ వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం..
రోడ్డు ప్రమాదంలో భర్తను పోగొట్టుకున్న మృతురాలు వనిత.. తన అక్క భర్త యాకూబ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈనెల 22న వనిత వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన యాకూబ్.. కోపంతో రగిలిపోయాడు. ఆమెపై తీవ్రంగా దాడి చేసి హతమార్చాడు.
అనంతరం భయాందోళనకు గురైన యాకూబ్.. భార్య సునీతతో పాటు సోదరి మంగమ్మ, మిత్రులు వెంకటేశ్వర్లు, గంగయ్యలను ఇంటికి పిలిచి జరిగిన విషయం చెప్పి సాయం కోరాడు. వారందరు కలిసి.. శవం పోలీసులకు దొరకకుండా, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు పథకం రచించారు.
ఆ విధంగా నేరస్థుడు సన్నిహితుల సాయంతో వనిత మృతదేహాన్ని ట్రాక్టర్లో తీసుకెళ్లి.. డీసీతండా శివారు ఎస్సారెస్పీ కాల్వలో పడేశారని ఏసీపీ రమేశ్ వివరించారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు, మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.క్షణికావేశంలో జరిగిన ఈ దారుణం వల్ల మృతురాలి ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.
ఇదీ చదవండి:ఒకేసారి ఎన్నికలు, వ్యాక్సినేషన్ సమస్యే: డీజీపీ గౌతమ్ సవాంగ్