ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

తలుపులన్నీ మూసినా.. నెట్టుకొస్తారు

అంతా సవ్యంగా ఉన్నట్లే కనిపిస్తుంది. ఉన్నట్లుండి ఎటు నుంచో సమస్య ముంచుకొస్తుంది. తలుపులన్నీ మూసేసి ఇంట్లోనే ఉన్నా.. మన ఫొటోలు, ఏకాంత దృశ్యాలు నెట్‌లో హల్‌చల్‌ చేస్తాయి. ఇదీ సైబర్‌ నేరగాళ్ల మంత్రజాలం. ప్రపంచానికి వాస్తవం తెలిసేలోగానే మనల్ని మళ్లీ పైకి రానివ్వని అగాధంలోకి నెడుతోంది. అందుకే ఎక్కడ, ఎప్పుడు, ఎలా మోసపోతామో తెలుసుకోవాలి. అప్రమత్తంగా ఉంటూ మనల్ని మనం రక్షించుకోవాలి. సైబరాసురుల కోరలు ఎలా పీకాలో చూద్దాం.

cheatings-in-cyber-frauds
cheatings-in-cyber-frauds

By

Published : Dec 28, 2020, 8:01 AM IST

ఈ సైబర్‌ శకంలో మేకవన్నె పులులకు మొదట బలవుతోంది యువతులు... మహిళలే. కంప్యూటర్లతో అనుసంధానమైన ఆధునిక ప్రపంచంలో ఇంట్లో కూర్చొని కూడా తమపని తాము చేసుకునే పరిస్థితి లేదు. అంతర్జాలం మాటున నక్కిన నేరగాళ్లు విసిరే వలల్లో చిక్కి ఎందరో అభాగినులు విలవిల్లాడుతున్నారు. ఎటు నుంచి ఏ ఉపద్రవం ఎలా ముంచుకొస్తుందో తెలుసుకోవాలి. ముందు మనం ఎలా వ్యవహరించాలి? ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఎదుటి వారిని ఎలా అదుపులో ఉంచాలో మనకు అవగాహన ఉండాలి. అన్నింటికీ మించి ఎలాంటి బెరుకూ.. భయం లేకుండా వెంటనే పోలీసుల్ని ఆశ్రయించాలి. వారు బాధితుల వివరాల్ని గోప్యంగా ఉంచుతూ... సైబర్‌ నేరగాళ్ల పీచమణుస్తారని గుర్తించాలి...

నేరం-1 అశ్లీల ప్రతీకారం

ఆమె విశాఖపట్నంలో ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగి. కొన్నాళ్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ‘మీరు కాల్‌గర్లే కదా’ అంటూ అవతలి వారు అసభ్యంగా మాట్లాడేవారు. తీవ్ర ఆవేదనకు గురై ఆమె పోలీసుల్ని ఆశ్రయించారు. గతంలో ఆమెతో కలిసి పనిచేసిన ఉద్యోగే దీనంతటికీ కారణమని తేలింది. తనకు లొంగకపోవడంతో సామాజిక మాధ్యమాల్లోని ఆమె వ్యక్తిగత చిత్రాల్ని సేకరించాడతను. వాటిని మార్ఫింగ్‌ చేసి అశ్లీల వెబ్‌సైట్‌లలో ఫోన్‌ నంబరు సహా పెట్టాడు.


ఒకటికి రెండుసార్లు...
*ఫొటోలు, వీడియోల్లో నిండైన దుస్తులు ధరించి ఉన్నా క్షణాల్లో నగ్నంగా చూపించే సాఫ్ట్‌వేర్‌లు వచ్చాయి. వాటిని వాడుతూ మహిళలను నేరగాళ్లు బెదిరిస్తున్నారు.
*సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పోస్టు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఫొటోలు, వీడియోలు డౌన్‌లోడ్‌ కాకుండా సెట్టింగ్‌లు మార్చుకోవాలి.

నేరం-2 పెళ్లిళ్ల పేరిట మోసం

హైదరాబాద్‌కు చెందిన యువతి.. తన వివరాల్ని ఓ మ్యాట్రిమోనియల్‌ సైట్‌లో నమోదు చేసుకున్నారు. ఓ రోజు ఆమెకు ఫోన్‌ వచ్చింది. అవతలి వ్యక్తి తాను అమెరికాలో వైద్యుడినని.. పెళ్లి చేసుకుంటానన్నాడు. పరిచయం పెరిగాక ఓ రోజు ఫోన్‌లో ‘నీ కోసం ఖరీదైన బహుమతి పంపిస్తున్నా’ అని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత కస్టమ్స్‌ అధికారుల పేరుతో ఆమెకు ఫోన్‌ వచ్చింది. ‘అమెరికా నుంచి ఖరీదైన బహుమతి వచ్చింది. ప్రాసెసింగ్‌ రుసుములు కింద నిర్దేశిత మొత్తం చెల్లించి తీసుకెళ్లొచ్చు’ అని చెప్పారు. నిజమేనని నమ్మిన ఆమె.. వారు చెప్పిన ఖాతాలో డబ్బు జమచేశారు. ఇలా దఫాల వారీగా రూ.8 లక్షలు పోగొట్టుకున్నారు.


ప్రత్యక్షంగా కలిశాకే...
*అవతలి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా పెళ్లి సంబంధాల గురించి చర్చించొద్దు. ప్రత్యక్షంగా కలిశాకే మాట్లాడదామని స్పష్టం చేయాలి.
*సంబంధం కుదరక ముందే బహుమతులు పంపిస్తానంటే అనుమానించాల్సిందే.

నేరం-3 అబ్బాయే అమ్మాయి పేరుతో...

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే యువతికి ఫేస్‌బుక్‌లో మరో యువతి పరిచయమైంది. ఇద్దరూ మిత్రులయ్యారు. అవతలి అమ్మాయి... రకరకాల ఫొటోలు పంపేది. ఇవతలి యువతి ఇంచుమించు నగ్నంగా ఉన్న తన ఫొటోలు పంచుకుంది. అమ్మాయిలా నటించింది ఓ నేరగాడని బయటపడింది. చెప్పినట్లు వినకపోతే ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని అతగాడు బెదిరించాడు. లైంగిక వేధింపులకూ పాల్పడేవాడు. బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. మరో ఘటనలో... 20 ఏళ్ల యువతికి ఫేస్‌బుక్‌లో ఓ యువకుడి నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. యథాలాపంగా ఆమె అంగీకరించింది. తర్వాత తరచూ ఛాటింగ్‌ చేసుకునేవాళ్లు. ప్రేమపేరుతో కలిసేవాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న దృశ్యాల్ని తన ఫోన్‌తో చిత్రీకరించేవాడు. పెళ్లి చేసుకుందామని యువతి అడిగేసరికి అతనిలో మార్పు వచ్చింది. ఏకాంత దృశ్యాలను అశ్లీల వెబ్‌సైట్‌లలో పెడతానని బెదిరింపులకు దిగాడు.


సరదాగానైనా వద్దేవద్దు
*అంతర్జాలంలో పరిచయమయ్యే వ్యక్తుల సమాచారం 90 శాతం నకిలీదే అయి ఉండొచ్చని భావించాలి. నేరుగా పరిచయం లేని వారి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను అంగీకరించొద్దు.
*వ్యక్తిగత చిత్రాలు, ఏకాంత దృశ్యాలు పంపించాలని అవతలి వారు కోరితే కచ్చితంగా అనుమానించాల్సిందే. వారి ఖాతాను బ్లాక్‌ చేసి.... పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలి.
*సామాజిక మాధ్యమాల పరిచయాల ఆధారంగా ఎవరితోనూ అతి చనువు ఏర్పరచుకోకూడదు. కలుద్దామని ఎవరైనా కోరినా వారు రమ్మన్న చోటుకు వెళ్లటం శ్రేయస్కరం కాదు.
*ఏకాంతంగా, సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీస్తుంటే అడ్డుకోండి.

నేరం-4 వెబ్‌క్యాం హ్యాకింగ్‌

సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేసే యువతికి కొన్నాళ్లుగా బెదిరింపు సందేశాలు వస్తున్నాయి. ‘నీ వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు నా దగ్గర ఉన్నాయి. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని అశ్లీల వెబ్‌సైట్‌లలో ఆప్‌లోడ్‌ చేస్తా’ అని వాటి సారాంశం. తొలుత ఆమె పట్టించుకోలేదు. కొన్ని రోజులయ్యాక ఆమె వీడియోలు పోర్న్‌ వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్‌ చేసిన దుండగుడు ఆ లింక్‌లను పంపించాడు. ఆమె పోలీసుల్ని ఆశ్రయించారు. యువతి ల్యాప్‌టాప్‌ వెబ్‌ కెమెరాను నిందితుడు హ్యాక్‌ చేసి, దృశ్యాలను చిత్రీకరించినట్లు తేలింది.


స్టిక్కర్‌తో మూసేయండి
*ల్యాప్‌టాప్‌/కంప్యూటర్‌ వెబ్‌ కెమెరాలను వాడనప్పుడు వాటిని స్టిక్కర్‌లతో మూసేయండి. స్మార్ట్‌ఫోన్ల ముందుండే కెమెరాలనూ మూసి ఉంచాలి.
*ల్యాప్‌టాప్‌/కంప్యూటర్‌లకు పటిష్ఠమైన పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలి.
*యాంటీ వైరస్‌తో స్కాన్‌ చేయకుండా వేటినీ డౌన్‌లోడ్‌లూ చేయొద్దు.
*మొబైల్‌ను సర్వీసింగ్‌కు ఇచ్చి తిరిగి తీసుకున్నాక ఏమైనా స్పైయింగ్‌ యాప్‌లు పొందుపరిచారేమో చూడాలి.

నేరం-5 కొంప ముంచే పోస్టులు

తాను ఏ పనిచేసినా ఆ వివరాల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయటం ఆ యువతికి అలవాటు. ఆమె ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం ఖాతాలను వేల మంది అనుసరిస్తుంటారు. ఒంటరిగా ట్రెక్కింగ్‌కు వెళ్లాలనుకున్న ఆమె పర్యటన వివరాలను తన ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. వాటిని పరిశీలించిన ఓ నేరగాడు ఆమెను వెంబడించాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు తప్పించుకుని పోలీసుల్ని ఆశ్రయించారు.


ప్రతిదీ పోస్టు చేయడమెందుకు?
*మీ వ్యక్తిగత వివరాలన్నింటినీ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయటం శ్రేయస్కరం కాదు.
*కొంతమంది తాము లైవ్‌లో చిత్రాలు, వీడియోలు తీసుకుని.. వారున్న ప్రదేశం వివరాలు ట్యాగ్‌ చేస్తూ పోస్టులు పెడుతుంటారు. ఇదీ ఇబ్బందులు తెస్తుంది.
* మీ సామాజిక మాధ్యమ ప్రొఫైల్‌ను కుటుంబసభ్యులు, స్నేహితులే చూసేలా ప్రైవసీ సెట్టింగ్‌లు మార్చుకోవాలి.

తల్లిదండ్రులూ.. ఇలా చేయండి

*విద్యార్థినులు, యువతులు.. సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు పాల్పడే వారి వలలో చిక్కుకుంటున్నారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలచేత చిన్నతనం నుంచే జీవన నైపుణ్యాలు అభ్యసనం చేయించాలి. అంతర్జాలంతో కలిగే మంచి, చెడు రెండింటినీ అర్థమయ్యేలా వివరించాలి.
*సామాజిక మాధ్యమాల్లో ఇబ్బందికర వాతావరణం ఉన్నా, బెదిరింపుల్లాంటివి వస్తున్నా... వెంటనే తమకు తెలపాలని అమ్మాయిలకు చెప్పాలి. తరచూ వారి స్నేహితుల జాబితాను తరచూ సమీక్షిస్తుండాలి.

భరించొద్దు.. ఫిర్యాదు చేయండి

సైబర్‌ నేరాల బారిన పడి, సామాజిక మాధ్యమాల్లో వేధింపులను మౌనంగా భరిస్తూ మీలో మీరు కుమిలిపోవద్దు. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం పరువు తక్కువనుకోవద్దు. మీ సమస్య చెబితే వివరాలు గోప్యంగా ఉంచి... నేరగాళ్ల ఆటకట్టిస్తాం. తల్లిదండ్రులూ అమ్మాయిలకు ధైర్యం చెప్పాలి. ఏ కష్టం వచ్చినా వారికి తోడుగా ఉంటామనే భరోసా కలిగించాలి.

- జీఆర్‌ రాధిక, ఎస్పీ, సైబర్‌ నేరాల విభాగం, ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ

ఇదీ చూడండి:నేటి నుంచి తెదేపా 'రైతు కోసం'

ABOUT THE AUTHOR

...view details