దక్షిణాఫ్రికాలో రాజహంసల (ఫ్లెమింగోస్)కు తీవ్ర సమస్య వచ్చిపడింది. ఊహించని కరవుతో కళ్లు కూడా తెరవని చిన్న పక్షి పిల్లలు ఆది లోనే అకాల మరణం చెందుతున్నాయి. రాజహంసలు సంతానోత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉన్న కింబెర్లీలోని జలాశయం కరవు వల్ల ఎండిపోయింది. వేడిగా మారిన వాతవరణం చుట్టుపక్కల ప్రదేశాలను అట్టుడికిస్తూ పక్షుల జీవితాలను అతలాకుతలం చేస్తోంది.
తినడానికి సరైన ఆహారం లేక, తాగడానికి నీరు లేక పక్షుల జీవితాలు చితికిపోతున్నాయి. గుడ్డు పొరను పగలగొట్టి బయటకు రావడానికి చిన్న పిల్లలు అష్టకష్టాలు పడుతున్నాయి. ఏదోలా బయటపడ్డప్పటికీ ఎక్కువకాలం బతకలేకపోతున్నాయి.
అధికారుల ఏర్పాట్లు
రాజహంసల దయనీయ పరిస్థితి తెలుసుకున్న అధికారులకు వేలకొలది రాజహంస పిల్లల కళేబరాలు దర్శనమిచ్చాయి. ఈ దృశ్యాన్ని చూసిన అధికారులు ద్రవించిన హృదయంతో మిగిలిన పిల్లలను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
స్థానికుల సాయంతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి మొదటి విడతలో దాదాపు 900 పిల్లలను కింబెర్లీ నుంచి రాజధాని ప్రిటోరియాకు తరలించి తగిన ఆహారాన్ని అందిస్తున్నారు.
6-8వేల పిల్లలు అక్కడే..!
మొత్తంగా 3000 పిల్లలను ప్రిటోరియాకు పంపినట్లు అధికారులు తెలిపారు. మిగతా 6 నుంచి 8 వేల పిల్లలను విమానంలో తరలించేంత వయసు లేనందున జలాశయంలోనే విడిచిపెట్టామన్నారు.
ఇప్పటికైతే ఎలాగోలా రక్షించాం... వచ్చే ఏడాది కూడా కరవు వస్తే పరిస్థితేంటని అధికారులు ఆలోచిస్తున్నారు.