ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / elections

నడిపించే నాయు(కు)డికి.. నడిచొచ్చే విజయం - అభివృద్ధి

ఎన్నికల కమిషన్ రికార్డుల్లో అది రాష్ట్రంలో చిట్టచివరి నియోజకవర్గం.. కానీ..అక్కడ ఎమ్మెల్యే మాత్రం అభివృద్ధిలో దానిని మొట్టమొదటి స్థానంలో నిలిపారు. ఎందుకంటే ఆయన కేవలం ఎమ్మెల్యేనే కాదు మరి.. !  మూడు దశాబ్దాలుగా అక్కడ ఆయనే ఎమ్మెల్యే... ! ఆయన పట్ల వారి ప్రేమ ఏపాటిదంటే.. కనీసం... నామినేషన్ వేయడానికి రాకపోయినా ఆయన్ను వరుసగా గెలిపిస్తూనే  ఉన్నారు.

నడిపించే నాయు(కు)డికి.. నడిచొచ్చే విజయం

By

Published : Apr 6, 2019, 6:32 AM IST

కుప్పం...చంద్రబాబుకు మూడు దశాబ్దాల అనుబంధం

ముూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే చిట్టచివరి నియోజకవర్గం.. కుప్పం. 1989 వరకూ ఆ నియోజకవర్గం గురించి పెద్దగా ఎవరికీ తెలిసింది లేదు. ఆ తర్వాత ఆ నియోజకవర్గం స్వరూపమే మారిపోయింది. ఉమ్మడి రాష్టానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా .. ప్రతిపక్షనేతగా పనిచేసిన చంద్రబాబునాయుడు, నేటి నవ్యాంధ్ర ముఖ్యమంత్రి అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.


మూడు దశాబ్దాల బంధం
చంద్రబాబుతో కుప్పానికి మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. 1989లో రాష్ట్రానికి చివరగా.. అంతగా ఎవ్వరూ పట్టించుకోని కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు ఎంచుకున్నారు. ఆయన పోటీతో అప్పటి వరకూ .. సాగునీరు లేక.. రాళ్ల గుట్టలతో ఉన్న ఆ సాధారణ పల్లె ప్రాంతం.. స్వరూపమే మారిపోయింది. అప్పటి నుంచి ప్రతీ సారీ ఆయన ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. ఇప్పటికి ఆరుసార్లు ఇక్కడి నుంచి ఎన్నికైన ఆయన... ఏడోసారి బరిలో ఉన్నారు.

పరుగులెత్తిన ప్రగతి
నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచీ చంద్రబాబు కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. టెక్ సీఎంగా పేరుపొందిన సీఎం.. ఇజ్రాయెల్ తరహా వ్యవసాయ సాంకేతికతను రాష్ట్రంలో తొలిసారిగా కుప్పానికి పరిచయం చేశారు. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యాన్ని అమలు చేయడం కోసం... కుప్పం ను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. 30వేల ఎకరాల్లో సూక్ష్మసేద్యం ద్వారా ఇక్కడి రైతులు పంటలను సాగు చేస్తున్నారు. మరో వైపు ఉద్యాన, వాణిజ్య పంటలకు ప్రభుత్వం రాయితీలతో ప్రోత్సాహాలు అందిచటంతో కుప్పం మొత్తం వాణిజ్య పంటల స్వర్గధామంగా మారింది. పూలు, పండ్లు, కూరగాయలను పెద్దమొత్తంలో పండిస్తూ రైతులు లాభాల బాట పడుతున్నారు. కుప్పం సమీపంలోని పెద్ద బంగారునత్తంలో రాష్ట్ర ప్రభుత్వం ఇండో-ఇజ్రాయిల్ టెక్నాలజీతో సుమారు పదికోట్ల రూపాయల వ్యయంతో ఇరవై రెండు ఎకరాల్లో హార్టికల్చర్ ఎక్స్ లెన్స్ సెంటర్ ఎర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వచ్చాయి. ఈ ప్రాంత వాసులు కలలో కూడా ఊహించని రీతిలో కృష్ణాజలాలను కుప్పం ప్రాంతానికి రప్పించారు. 500కోట్లతో హంద్రీనీవా కాలువలు తవ్వించారు, దాదాపు 800కోట్లతో నియోజకవర్గంలో రోడ్లు వేయించారు. పక్క రాష్ట్రాలతో అనుసంధానం పెంచేలా..కుప్పం సమీపంలోని అమ్మవారిపేటలో 100 కోట్ల రూపాయల నిధులతో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు అవుతోంది.

నమ్మకమే విజయం
చంద్రబాబుపై కుప్పం వాసులకు.. కుప్పంపై చంద్రబాబుకు అపారమైన నమ్మకం. అదే పెట్టుబడిగా ఆయన వరుసగా కుప్పం నుంచి విజయకేతనం ఎగరేస్తున్నారు. అది ఎంతలా అంటే.. ఆయన కనీసం... నామినేషన్ వేయడానికి వెళ్లకపోయినా.. ప్రచారానికి రాకపోయినా.. కుప్పం వాసులు ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తూనే ఉన్నారు. ఆయన నామినేషన్ కు కూడా స్థానికులే చందాలు వేసుకుని... వారే నామినేషన్ దాఖలు చేస్తారు. తొలిసారి 7వేల మెజార్టీతో గెలిచిన చంద్రబాబు ఆతర్వాత 57వేలు, 66వేలు, 60వేల చొప్పున మెజార్టీ సాధిస్తూ వచ్చారు. చివరి రెండు సార్లు 46వేల చొప్పున మెజార్టీ వచ్చింది. 2014లో చంద్రబాబుపై పోటీ చేసిన చంద్రమౌళినే ఈసారి కూడా పోటీ చేస్తున్నారు. కుప్పంలో మెజార్టీతో చిత్తూరు లోక్​సభ స్థానం సులువుగా తెదేపా ఖాతాలోకి వస్తోంది. ఈసారి మెజార్టీని రెట్టింపు చేయాలని తెలుగుదేశం.. భావిస్తుండగా.. ఆయన మెజార్టీని బాగా తగ్గించాలని వైకాపా ప్రయత్నం చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details