ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / elections

ప్రముఖుల పోరు...నరసాపురం జోరు!

రాజకీయ చైతన్యానికి ప్రతీక నరసాపురం పార్లమెంటు. రాజకీయ ఉద్దండులు పోటీ చేసిన లోక్​సభ స్థానం. ఇక్కడి ఓటర్ల తీర్పే విలక్షణం. అలాంటి చోటు నుంచే ప్రముఖులు బరిలో ఉన్నారు. సామాజిక సమీకరణాలు, బుజ్జగింపులు, తాయిలాలతో రాజకీయ ఉక్కపోత ఎక్కువైంది. ఇంతకీ గోదావరి తీర ఆహ్లాదాన్ని ఆస్వాదించేదెవరూ?

ప్రముఖుల పోరు...నరసాపురం జోరు!

By

Published : Apr 6, 2019, 8:02 AM IST

పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంటు స్థానంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తెదేపా కంచుకోటలో జెండా రంగు మార్చాలని పార్టీలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. తెదేపా 3సార్లు, తెదేపా పొత్తుతో భాజపా 2సార్లు ఇక్కడ గెలిపొందింది. కాంగ్రెస్ 3సార్లు విజయం సాధించింది. ఈసారి అన్ని పార్టీలు ఒంటరిగానే బరిలో నిలిచాయి.

ప్రముఖుల పోరు...నరసాపురం జోరు!


అప్పుడు అసెంబ్లీ.. ఇప్పుడు పార్లమెంటుకు
నరసాపురం పార్లమెంటు పరిధిలో నరసాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, భీమవరం, ఉండి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒక్క ఉండి మినహా అన్ని పురపాలక పట్టణాలే. ఈ అసెంబ్లీ నియోజవర్గాల్లో తెదేపాకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. కిందటి ఎన్నికల్లో తెదేపా మద్దతుతో భాజపా అభ్యర్థి గోకరాజు గంగరాజు గెలిచారు. ప్రస్తుత తెలుగుదేశం అభ్యర్థి వెంకటశివరామరాజు... 2సార్లు ఉండి ఎమ్యెల్యేగా గెలిచారు. సామాజిక సమీకరణాలు సైతం ఇప్పుడు ఆయనకు కలిసి వచ్చే అవకాశముంది.


తెదేపా టూ వైకాపా
నరసాపురం పార్లమెంటు తెదేపా సమన్వయకర్తగా ఉన్న కనుమూరి రఘురామకృష్ణంరాజు వైకాపాలోకి జంపయ్యారు. నరసాపురంలో ఏడాదిన్నర కాలంగా ఆయన క్షేత్రస్థాయిలో పనిచేశారు. తెదేపా అభ్యర్థిగా అనుకునే సమయంలో పార్టీ మారి...వైకాపా నుంచి బరిలో నిలిచారు. ఆర్థికంగా బలంగా ఉండటం, క్షేత్రస్థాయిలో పరిచయాలు ఆయనకు ప్లస్​ కానున్నాయి. నరసాపురంలో వైకాపాకు ఓటుబ్యాంకు లేకపోవడం ప్రతికూలంశమే.

విడదీయరాని అనుబంధం
జనసేన బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపింది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. చిరంజీవి కుటుంబానికి ఈ ప్రాంతానికి విడదీయలేని బంధముంది. చిరంజీవి కుటుంబం స్వగ్రామమైన మొగల్తూరు ఈ పార్లమెంటు పరిధిలోనిదే. గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన క్యాడర్​ను కలుపుకొని పోవడం, జనసేనపై ఉన్న అభిమానం, సామాజిక వర్గం అండతో గెలుపుకోసం ఆయన కృషిచేస్తున్నారు.

వ్యతిరేకతతోనే ముందుకు..
భాజపా 2019 అభ్యర్థిగా మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాలరావు పోటీచేస్తున్నారు. కిందటి ఎన్నికల్లో ఆయన తాడేపల్లిగూడెం ఎమ్యెల్యేగా గెలిచి... తెదేపా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. భాజాపా సిట్టింగ్ ఎంపీ గోకరాజు గంగరాజు ఈసారి పోటీకి దూరం కావడం వల్ల... పైడికొండల మాణిక్యాలరావు పోటీలో ఉన్నారు. తెదేపా పొత్తు కిందటిసారి భాజపాకు కలిసొచ్చింది. ఈసారి ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మాణిక్యాలరావు ఏ మేరకు ఎదుర్కొంటారో చూడాలి.
కాంగ్రెస్ నుంచి ఎప్పుడూ పోటీచేసే.. కనుమూరి బాపిరాజు ఈసారి కూడా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పూర్తిస్థాయిలో పట్టుకోల్పోవడం వల్ల.. ఆయన పోటీ నామమాత్రమైంది. రెండుమూడు నెలలుగా సామాజిక మాధ్యమాలు, వార్తల్లో ఉంటున్న.. కేఏ పాల్ అందర్ని ఆకర్షించారు. ప్రజాశాంతి పార్టీ తరుపున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 6పార్టీలు బరిలో ఉన్నా.. తెదేపా, వైకాపా, జనసేన మధ్యే ప్రధాన పోటీ.

ABOUT THE AUTHOR

...view details