Young Man Suicide : వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి అందినంత వరకు అప్పులు చేసిన యువకుడు వాటితో పాటు ఆన్లైన్లో సైతం అప్పు చేశాడు. ఇంకేముంది అన్లైన్లో పొందిన అప్పులు తీర్చమంటూ వేధింపులు మొదలయ్యాయి. ఆదుకోవడానికి ఎవరూ లేక దిక్కుతోచని స్థితిలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు ఎవరూ కారణం కాదంటు.. తన అలవాట్లే తనకు శాపంలా మారాయని వివరిస్తూ సదరు యువకుడు లేఖను రాసిపెట్టి తనువు చాలించిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.
జిల్లాలోని పెనుమూరు మండలంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన జానకిరామ్ (30) ప్రైవేట్ పనులు చేసుకుంటూ తల్లి, అన్న, వదినలతో కలిసి జీవిస్తున్నాడు. వ్యక్తిగత అవసరాలు, జల్సాల కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలిసిన వారి దగ్గర అప్పు చేశాడు. అవీ చాలకపోవడంతో లోన్‌యాప్ ద్వారా 80వేల రూపాయలను అప్పుగా తీసుకుని అవసరాలు తీర్చుకున్నాడు. తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేక పోయాడు. ఆన్లైన్ ద్వారా రుణం ఇచ్చిన వారు తిరిగి చెల్లించాలంటూ నిరంతరాయంగా వేధించడంతో మానసిక కుంగుబాటుకు లోనై ముభావంగా ఉండేవాడు.