ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకునేందుకు నిర్ణీత రుసుము చెల్లించాలని కోరినందుకు పర్యాటక శాఖ సిబ్బందిపై విజయవాడకు చెందిన వైకాపా కార్పొరేటర్ భర్త సమక్షంలో అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున హరిత బెర్మ్ పార్క్ హోటల్‌లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. భవానీపురంలో కృష్ణా నది ఒడ్డున పర్యాటక శాఖకు చెందిన హరిత హోటల్ ఉంది. కాబోయే వధూవరులతో కలసి ప్రీ వెడ్డింగ్ షూట్ తీసేందుకు ఫొటోగ్రాఫర్ సుభానీ ఉదయం 5:30 గంటలకు వచ్చారు. ఆ సమయంలో ఫొటోలు తీసేందుకు అనుమతి లేదంటూ సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం తెలిపారు. తాము హోటల్‌లో గది తీసుకుంటామని చెప్పడంతో లోనికి అనుమతించారు. అనంతరం ఫొటోగ్రాఫర్ సుభానీ సహాయకులతో కలిసి నది ఒడ్డున లాన్‌లో ఫొటోలు తీయడం ప్రారంభించాడు. గమనించిన హోటల్‌లో పనిచేసే శ్రావణ్ వచ్చి, ఫొటో షూట్‌కు తగిన రుసుం చెల్లించాలని, రిసెప్షన్ దగ్గరకు వెళ్లాలని సూచించారు. ఈ విషయమై మాటామాటా పెరిగింది. సుభానీ అసభ్యంగా దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. విషయాన్ని శ్రావణ్.. హోటల్‌లో వంట చేసే ప్రసాద్‌కు చెప్పారు. వారిద్దరూ కలిసి వెళ్లగా ఇద్దరిపైనా దాడికి పాల్పడ్డారు. విషయం తెలిసి యూనిట్ మేనేజర్ శ్రీనివాస్ హోటల్‌కు రాగా, ఆయనపైనా సుభానీ, సహాయకులు కాలర్ పట్టుకొని చేయి చేసుకున్నారు. సుభానీ తనకు పరిచయమున్న 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్‌రెడ్డికి ఫోన్ చేసి రప్పించాడు.
వచ్చీరాగానే వీరంగం:ప్రసాద్‌రెడ్డి 15 మంది అనుచరులతో కలిసి మూడు కార్లలో హోటల్ వద్దకు వచ్చాడు. వెంటనే అనుచరులు ఆగ్రహంతో ఊగిపోయారు. అందుబాటులో ఉన్న కర్రలు, ఇనుప రాడ్లతో హోటల్ సిబ్బందిపై దాడికి దిగారు. సుభానీతో కలిసి కొద్దిసేపు వీరంగం సృష్టించారు. సిబ్బంది శ్రావణ్, ప్రసాద్‌ను కొట్టడంతో రక్తస్రావమైంది. కొందరు సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. కార్పొరేటర్ భర్త మాజీ మంత్రి అనుచరుడు కావడంతో కేసులో అతని పేరు చేర్చకుండా తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయని సమాచారం. మరోపక్క, హోటల్ మేనేజర్ శ్రీనివాస్‌కు ఓ ప్రజాప్రతినిధికి సమీప బంధువు కావడం, సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు నిక్షిప్తం కావడంతో పోలీసులు ప్రసాద్‌రెడ్డిపై కేసు నమోదు చేయక తప్పలేదని తెలుస్తోంది. బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.