WIFE KILLED HUSBAND : ఫేస్బుక్ పరిచయం.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు కుట్ర పన్నారు. అనుకున్నట్లుగానే హత్య చేసి ఆపై అనుమానం రాకుండా ఉండేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగుచూసింది. ఈ ఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలో కరీముల్లా అనే ఆటోడ్రైవర్ ఈనెల 8వ తేదీన పట్టణ శివార్లలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద గోనె సంచిలో మృతదేహంగా కనిపించాడు. తన భర్త చనిపోయాడంటూ పోలీసులకు అతని భార్య మున్ని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించారు. ఆటో డ్రైవర్ కావడంతో ఇతర తగాదాలు, భూ వివాదాలు ఏమైనా హత్యకు దారి తీసి ఉంటాయనే కోణంలో భావించి విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనకు అసలు కారణం కరీముల్లా భార్య వివాహేతర సంబంధమేనని తేలింది. ఆమె కాల్రికార్డ్స్, సామాజిక మాధ్యమాల వినియోగంపై దృష్టి పెట్టిన పోలీసులు ఆ కోణంలో విచారించారు. దాంతో అసలు విషయం బయటపడింది.