Today Crime News: గుంటూరు జిల్లా పసుమర్రు వద్ద చీరాల వెళ్లే రహదారిలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో నడుచుకుంటూ వస్తున్న జూపూడి చలమయ్య (48) అనే దివ్యాంగుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడికి భార్య సత్యవతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో వారంతా విలపిస్తున్నారు. చిలకలూరిపేట గ్రామీణ ఎస్సై రాజేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. ఒకరికి తీవ్రగాయాలు:బాపట్ల జిల్లా చెరుకుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతదేహాలను శవ పరీక్షలకోసం తెనాలి మార్చురీలో ఉంచారు. ఈ ఘటనపై చెరుకుపల్లి పోలీసులు వివరాలు సేకరించారు.
అప్పులు బాధ తాళలేక మిర్చి రైతు ఆత్మహత్య:బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామంలో కౌలు మిర్చి రైతు కంచర్ల పెద్ద ఎల్లయ్య (50) అప్పుల బాధ తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తామని అద్దంకి నియోజకవర్గ జనసేన నాయకులు తెలిపారు.
బీహార్ కూలిపై కత్తితో దాడి:తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలోని రాయల చెరువు కట్టపై సమీపంలో ఉన్న ముత్యాలమ్మ గుడి దగ్గర అర్ధరాత్రి బిహారీ కూలిపై అతని స్నేహితుడు కత్తితో దాడి చేశాడు. మండలంలోని ఎన్.ఆర్ కమ్మపల్లి భారతం గుడి దగ్గర గ్రానైట్ కూలీగా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన దుల్షాన్ (19)ను అతని స్నేహితుడు వీరేంద్ర (20) పాతకక్షల కారణంగా మెడపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులు అతను చూసి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న రామచంద్రాపురం పోలీసులు అతడిని 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆంధ్ర-ఒడిశా ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం:విజయనగరం జిల్లా పాచిపెంట మండలం ఆంధ్రా- ఒడిశా సరిహద్దు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బియ్యం లోడుతో ఒడిశా నుంచి ఆంధ్రా వైపు వస్తున్న ఓ లారీ అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒడిశాలోని సింబిలిగూడకు చెందిన కారా అనే వ్యక్తి మృతి చెందాడు. లారీ డ్రైవర్ కాలు విరిగిపోయింది. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను సాలూరు ఆసుపత్రికి తరలించారు.
తుని పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్:తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని రెల్లి వీధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ నాగదుర్గారావు ఆద్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది, ఆబ్కారీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అపరేషన్లో భాగంగా ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేకుండా ఉన్న పది ద్విచక్ర వాహనాలను గుర్తించారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన 70 ఏళ్ల వృద్ధురాలు:కాకినాడ జిల్లా తుని రైల్వేస్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన 70 ఏళ్ల వృద్ధురాలిని జీఆర్పీ పోలీసులు కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. విశాఖ జిల్లా అరట్లకోటకు చెందిన సుబ్బయ్యమ్మగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వృద్ధురాలు చెప్పిందని పోలీసులు తెలిపారు.
ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు:కాకినాడలోని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయగోపురంకు ఉన్న అమ్మవారి విగ్రహాన్ని నాశనం చేశారు. దేవతామూర్తుల పటాలను దుండగులు డ్రైనేజీలో వేశారు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం:నెల్లూరు జిల్లాలో వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద పోలీసులు భారీగా మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. సుమారు 21 లక్షలకు పైగా విలువైన 431 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నర్సీపట్నం నుంచి చెన్నైకి ఈ గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పాత కక్షలతో గొడవ-- ఒకరి పరిస్థితి విషమం,ఏడుగురికి తీవ్రగాయాలు:అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని దేవాదులకొండ ఎస్సీ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో 8 మందికి తీవ్రగాయాలు కాగా చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఈ ఘర్షణపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.