ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

పెళ్లిరోజే పెను విషాదం... కుమారుడిని రక్షించబోయి.. - కుమారుడిని రక్షించబోయి తండ్రి మృతి

Tragedy in picnic : పెళ్లి రోజును సరదా గడిపేందుకు ఓ కుటుంబం.. జలపాతం వద్దకు విహారానికి వెళ్లారు. వారంతా జలపాతం కింద తడుస్తూ ఉల్లాసంగా గడిపారు. అంతలోనే ప్రమాదవశాత్తు కుమారుడు నీటి ప్రవాహంలో పడి మునిగి పోవటాన్ని గమనించిన ఆ తండ్రి.. అప్రమత్తమై తన కుమారుడి రక్షించాడు. కానీ ఈ క్రమంలో తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.

father dead while rescue son
father dead while rescue son

By

Published : Feb 10, 2022, 8:50 AM IST

Son safe.. Father died: విహారయాత్ర ఆ ఇంట తీరని విషాదాన్ని మిగిల్చింది. పెళ్లిరోజు కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపేందుకు జలపాతం వద్దకు వెళ్లి అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఇంటి యజమాని మృత్యువాత పడటం ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నీటిలో కొట్టుకుపోతున్న కుమారుడిని రక్షించిన తండ్రి.. తాను మాత్రం మృత్యువు నుంచి బయట పడలేకపోయారు. తూర్పు గోదావరి జిల్లా మోతుగూడెం వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన కక్కిరాల పురుషోత్తం మృతి చెందారు.

అశ్వారావుపేటలో పెట్రోల్‌ బంకుతోపాటు, పలు వ్యాపారాలను పురుషోత్తం నిర్వహిస్తున్నారు. అశ్వారావుపేట మండలం నారాయణపురానికి చెందిన సంతోషిణిని 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి 12, 10 ఏళ్ల వయసున్న దీలీప్‌, దీపక్‌ కుమారులు. బుధవారం ఆ దంపతుల పెళ్లిరోజు కావడంతో కుటుంబ సమేతంగా చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని జలపాతం వద్దకు విహారానికి వెళ్లారు. వారంతా జలపాతం కింద తడుస్తూ ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో పెద్ద కుమారుడు నీటి ప్రవాహంలో పడి మునిగి పోతున్నాడు. పురుషోత్తం ప్రవాహంలోకి దిగి పైన ఉన్న భార్యకు కుమారుడ్ని అందించి కాపాడాడు. ఈ క్రమంలో తాను నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ లోయలో పడిపోయాడు. కళ్లెదుటే పురుషోత్తం నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండటాన్ని చూసిన భార్య, కుమారులు పెద్ద పెట్టున ఆర్తనాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు రెండు గంటలపాటు శ్రమించి లోయలో పడి విగతజీవిగా మారిన పురుషోత్తం మృతదేహాన్ని పైకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసిన మోతుగూడెం ఎస్సై సత్తిబాబు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చింతూరు ఆసుపత్రికి తరలించారు. అందరితో కలివిడిగా నవ్వుతూ మాట్లాడే పురుషోత్తం మృతితో దమ్మపేట, అశ్వారావుపేటలో విషాదం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details