Nellore Theft Case: నిర్మాణంలో ఉన్న కొత్త కోర్టు భవనం వద్ద ఇనుము దొంగతనానికి వెళ్లి.. అది కుదరకపోవడంతో ప్రస్తుత కోర్టులో చోరీ చేశారని నెల్లూరు ఎస్పీ సీహెచ్ విజయరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెల్లూరు కోర్టులో దొంగతనం కేసులో నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. కేసు వివరాలను విలేకర్లకు ఆదివారం ఎస్పీ వెల్లడించారు. ‘కుటుంబానికి దూరంగా ఉంటూ మద్యానికి బానిసలైన హయాత్, రసూల్ అనే వ్యక్తులు నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండు సమీపంలో పైవంతెన కింద నివసిస్తున్నారు. డబ్బు కోసం దొంగతనాలు చేస్తున్నారు. హయాత్ 15 కేసుల్లో నిందితుడు. తరచూ కోర్టులో విచారణకు హాజరయ్యేవాడు. ఆ క్రమంలో కోర్టు ప్రాంగణంలో కడుతున్న కొత్త భవనంలో ఇనుము చోరీ చేయాలనుకున్నాడు. ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి పాత జైలు మీదుగా కోర్టు ప్రాంగణంలోకి హయాత్, రసూల్ ప్రవేశించారు. ఇనుము ఉన్నచోటుకు వెళ్తుండగా కుక్కలు మొరగడంతో భయపడి అక్కడి నుంచి కోర్టు మొదటి అంతస్తులోకి చేరుకున్నారు. కోర్టులో విలువైన వస్తువులు ఉంటాయని భావించి.. తాళాన్ని ఇనుప రాడ్డుతో పగలగొట్టారు. అనంతరం గదిలో ఉన్న బీరువా తెరవగా అందులో సంచి కనిపించింది. అక్కడ విలువైన వస్తువులు ఉంటాయని భావించి అపహరించారు. తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకుని.. మిగిలిన పత్రాలను పక్కనే ఉన్న కాలువలో పడేశారు’ అని తెలిపారు. చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారన్నారు. వారినుంచి ల్యాప్‌టాప్, ట్యాబ్, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి అపోహలకు తావులేదని, రాజకీయ ప్రమేయం లేదని విచారణలో తేలిందన్నారు.
ప్రత్యేక బృందాల ఏర్పాటు
కోర్టు బీరువాలోని 521/2016 కేసుకు సంబంధించిన పత్రాలు, ల్యాప్‌టాప్, ట్యాబ్, సెల్‌ఫోన్లు, పలు ఆధారాలు భద్రపరిచిన సంచి చోరీ కావడంపై 14వ తేదీ ఉదయం కోర్టు సిబ్బంది చిన్నబజారు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. కోర్టు సమీపంలోని కాలువలో సంచిని గుర్తించి కోర్టు సిబ్బందికి అందజేశారు. ఇద్దరు ప్రధాన నాయకుల కేసు కావడంతో ఎస్పీ స్పందించారు. కావలి అదనపు ఎస్పీ ప్రసాద్‌రావు నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు బాజీజాన్ సైదా, మధుబాబు, శ్రీరామ్, వీరేంద్రబాబులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. కోర్టు ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో కోర్టుకు వచ్చే అన్ని రహదారుల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు బ్యాగుతో అనుమానాస్పదంగా వెళ్తుండటాన్ని గుర్తించారు. వారిని పాత నేరస్తులు సయ్యద్ హయాత్, అతని స్నేహితుడు షేక్ రసూల్ అలియాస్ మస్తాన్‌గా నిర్ధారించుకుని గాలించారు. ఆదివారం నిందితులను ఆత్మకూరు బస్టాండు ఫ్లైఓవరు కింద అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
"నెల్లూరు కోర్టులో చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేశాం. సీసీ కెమెరా దృశ్యాలు సహా పూర్తి ఆధారాలతో కేసు ఛేదించాం. సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు తీసుకుని మిగతా పేపర్లను పడేశారు. బెంచ్ క్లర్క్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాం. నిందితులు సయ్యద్ హయత్, ఖాజా రసూల్‌పై పలు కేసులు. ఇద్దరు నిందితులపై 14 పాత కేసులు ఉన్నాయి. ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిందితులను అరెస్టు చేశాం. ట్యాబ్, ల్యాప్‌ట్యాప్, 4 సెల్‌ఫోన్లు, 7 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నాం." - విజయారావు, జిల్లా ఎస్పీ