యువజంటను అటకాయించి, యువతిపై సామూహిక అత్యాచారానికి (Miyapur gang rape case) పాల్పడిన కామాంధులకు న్యాయస్థానం జీవితఖైదు విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. ముద్దాయిలకు రూ.20,000 చొప్పున జరిమానా విధించింది. తెలంగాణ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం న్యూహఫీజ్‌పేట్ ఆదిత్యనగర్‌కు చెందిన షేక్ షౌకత్(35), మహ్మద్ ఖాలిద్ అలియాస్ అబ్బు(22), మహ్మద్ అఫ్రోజ్ అలియాస్ లాల్(20), అబ్దుల్ సల్మాన్‌ఖాన్ అలియాస్ రైడర్(20), షేక్ సల్మాన్(22), ముజాహిద్‌ఖాన్ అలియాస్ షారూఖ్(20), మరో బాలుడు(17) కలిసి 2019 జనవరి 19న రాత్రి 7 గంటల ప్రాంతంలో హఫీజ్‌పేట రైల్యే స్టేషన్ సమీపంలోని పొదల చాటున మద్యం తాగుతున్నారు.
ఆ సమయంలో అటుగా వెళ్తున్న యువజంటను వారంతా అటకాయించారు. యువతి(25)ని పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించిన యువకుడిపై దాడి చేశారు. వారి ఆర్తనాదాలు విన్న స్థానికులు అక్కడికి చేరుకునేలోపే పరారయ్యారు. యువకుడి ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజుల్లోనే నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. పూర్తి ఆధారాలతో అభియోగ పత్రం దాఖలు చేశారు.