తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గంజాయిపై ఆ రాష్ట్ర పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో గంజాయి విక్రయిస్తున్న(Ganja Smuggling) వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. చెరువుకట్టపై గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులకు పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి 1.56 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాచుపల్లిలోని ఓ గదిలో తనిఖీ చేయగా మరో 3.5 కిలోల గంజాయి లభ్యమైందని పేర్కొన్నారు.
డ్రగ్స్ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం..
ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తుపదార్థాల నియంత్రణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి విస్పష్ట ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు, ఎక్సైజ్ శాఖల అధికారులు మత్తు దందాపై ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్, గంజాయి విక్రేతలు, సరఫరాదారుల సమాచారం సేకరించి వారిపై నిఘా ఉంచారు. గంజాయి విక్రయిస్తే ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరిస్తున్నారు.