Gang Making Fake Certificates Arrested: పోలీసుల వద్ద ముసుగులో ఉన్న వీరంతా ఘరానా మోసగాళ్లు. లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఇస్తే ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్.. ఇలా ఏ కోర్సుకు సంబంధించిన నకిలీ ధ్రువపత్రాలైనా తయారు చేసి ఇస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన వర్సిటీలే కాకుండా దేశంలోని ఏ విశ్వవిద్యాలయం సర్టిఫికెట్ అయినా కాదనకుండా ఇచ్చేస్తారు.
వీరు తయారు చేసిన సర్టిఫికెట్లు చూస్తే, నకిలీవని చెప్పేవరకూ ఎవ్వరికీ తెలియదు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విద్యార్ధులు, తల్లిదండ్రుల బలహీనతలను ఆసరాగా చేసుకుని లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. ఈ ముఠాలోని ఆరుగురు సభ్యులను, సర్టిఫికెట్లు కొనుగోలు చేసిన మరో ముగ్గురిని వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు.
వీరి నుంచి వివిధ వర్సిటీలకు సంబంధించిన 88 నకిలీ ధ్రువపత్రాలు, 9 నకిలీ సర్టిఫికెట్ల నమూనాలు, 4 స్టాంపులు, హోలో గ్రామ్స్, 16 సెల్ ఫోన్లు, ఒక కలర్ ప్రింటర్, 5లక్షల 37 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆయా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్ హ్యాక్ చేసి, నకిలీ సర్టిఫికెట్లు పొందిన వ్యక్తుల వివరాలు నమోదు చేయడం వీరి ప్రత్యేకత.
ఇప్పటివరకు 665కిపైగా వివిధ విద్యార్హతలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లు విక్రయించారని విచారణలో తేలింది. నకిలీ సర్టిఫికెట్లు పొందిన 127 మంది విద్యార్ధులను సైతం గుర్తించారు. ఇప్పటికే నకిలీ ధ్రువపత్రాలతో పలువురు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందినట్లు పోలీసుల విచారణలో తేలింది. నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసిన ముఠాతోపాటు, వాటిని కొనుగోలు చేసినవారిపైనా కఠిన చర్యలుంటాయని పోలీసులు తెలిపారు.
డిగ్రీకి లక్ష, బీటెక్కు లక్షన్నర.. ఏదైనా క్షణాల్లో రెడీ.. అసలేంటీ కథ?
ఇవీ చదవండి: