ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

భాకరాపేట ఘటనలో తొమ్మిదికి చేరిన మరణాల సంఖ్య.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి - AP News

Bakaraopeta Bus accident :పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట.. చావు డప్పులు వినపడేలా చేసింది.. భాకరాపేట ప్రమాదం. కుటుంబసభ్యులు, ఆత్మీయులతో ఆనందం రెట్టింపు కావాల్సిన తరుణంలో.. తొమ్మిది మంది అకాల మరణం... కన్నీటిని మిగిల్చింది. బస్సు బోల్తా పడిన ఘటనలో మృతి చెందినవారి అంత్యక్రియలు... అశ్రు నయనాల మధ్య అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ముగిశాయి. తల్లిదండ్రుల కడ చూపునకు కూడా నోచుకుని చిన్నారి చందన మృతి.. ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.

Bakaraopeta Bus accident
Bakaraopeta Bus accident

By

Published : Mar 28, 2022, 5:05 AM IST

Updated : Mar 28, 2022, 7:11 AM IST

Bakaraopeta Bus accident: చిత్తూరు జిల్లాలోని మదనపల్లె- తిరుపతి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. వీరిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారుకాగా, డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు, దినపత్రిక విలేకరి, ఓ బాలిక ఉన్నారు. వీరి మృత దేహాలకు ఆదివారం శవ పరీక్షలు పూర్తి చేసి స్వస్థలాలకు పంపించారు. క్షతగాత్రులకు తిరుపతిలోని రుయా, స్విమ్స్‌, బర్డ్‌ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలోని యువతి ఇంట జరగాల్సిన వివాహ నిశ్చితార్థానికి వస్తుండగా మార్గమధ్యలో బస్సు అదుపుతప్పి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రాత్రివేళ కనుమ దారిలో స్పీడ్‌ బ్రేకర్‌ను వేగంగా తాకి పైకి లేచిన బస్సు.. అదే వేగంతో పక్కనున్న లోయలోకి దూసుకుపోయింది. ఏం జరిగిందో తేరుకునేలోపే ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో మరణించారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. బస్సులో 63 మంది ఉన్నారు.

ఆ ఇంట పెను విషాదం..:ఈ దుర్ఘటనలో వివాహ నిశ్చితార్థం జరగాల్సిన మల్లిశెట్టి వేణు ఇంట ఐదుగురు చనిపోయారు. వేణు తండ్రి మురళి, చిన్నాన్న గణేష్‌, పిన్ని లక్ష్మీకాంతమ్మ, తాత వరసయ్యే వెంగప్ప, అతని భార్య నాగలక్ష్మి ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ధర్మవరం ప్రాంతంలో ఓ దినపత్రిక విలేకరిగా పని చేస్తున్న ఆదినారాయణరెడ్డి ఆదివారం తెల్లవారు జామున ఆసుపత్రిలో మరణించారు. ఘటనాస్థలిలో చనిపోయిన వారి మృత దేహాలను అర్ధరాత్రే రుయాకు తరలించారు. ఉదయం 11 గంటలకల్లా 8 మృతదేహాలకు శవ పరీక్షలు పూర్తిచేసి అంబులెన్సుల్లో ధర్మవరానికి తరలించారు. క్లీనర్‌ షకీల్‌ మృతదేహాన్ని కదిరిలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. పెళ్లి సంబంధం కుదిర్చిన చంద్రశేఖర్‌, పద్మావతి దంపతులు గాయాలపాలై ఆసుపత్రిలో ఉండగా వారి కుమార్తె చందన చనిపోయింది. సాయంత్రం ఆమె స్వస్థలం తనకల్లు మండలం గోవిందునివారిపల్లెలో అంత్యక్రియలు పూర్తి కాగా కన్నవారు, తోబుట్టువు కడచూపునకూ నోచుకోలేదు.

ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, తితిదే ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలతో సీవీఎస్వో గోపీనాథ్‌ జెట్టి ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. స్వయంగా క్షతగ్రాతులను బస్సులోంచి బయటకు తీశారు. కలెక్టర్‌ హరినారాయణన్‌ వచ్చి అంబులెన్సులతోపాటు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను స్వయంగా నియంత్రించారు. అగ్నిమాపక సిబ్బంది, టాస్క్‌ఫోర్స్‌, స్థానికులు, మార్గంలోని డ్రైవర్లు అందించిన సహకారంతో క్షతగాత్రులను వేగంగా తిరుపతికి చేర్చగలిగారు. రుయా, స్విమ్స్‌, బర్డ్‌ ఆస్పత్రుల్లో వెంటనే వైద్య చికిత్సలు ప్రారంభించారు. ఎక్కువ మందికి తల, కాళ్లకు తీవ్రగాయాలైనట్లు వైద్యులు తెలిపారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి, ధర్మవరం ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రుయాలో బాధితులను పరామర్శించారు. మరోపక్క, బస్సు డ్రైవర్‌ గత రికార్డుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వేగంగా వెళ్లొద్దని బస్సులో ఉన్నవారు చెబుతున్నా డ్రైవర్‌ పట్టించుకోలేదని క్షతగాత్రులు వాపోయారు. నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేరళ రిజిస్ట్రేషన్‌తో ఉన్న బస్సు ఫిట్‌నెస్‌పై అధికారులు పరిశీలిస్తున్నారు.

భాకరాపేట ఘటనలో తొమ్మిదికి చేరిన మరణాల సంఖ్య..

ప్రధాని, ముఖ్యమంత్రి సంతాపం..:ఘోర బస్సు ప్రమాదంలో ఆప్తులను కోల్పోవడం బాధాకరమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధి నుంచి మృతుల బంధువులకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేల సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించారని, మృతుల కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారని మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి తెలిపారు.

  • ప్రమాదంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

ఇదీ చదవండి:చావు మరీ ఇలా కూడా వెంటాడుతుందా?! పెళ్లింట విషాదం..

Last Updated : Mar 28, 2022, 7:11 AM IST

ABOUT THE AUTHOR

...view details