CHANGES IN ROAD WIDTH: విశాఖ నగరంలో వెడల్పు తగ్గించాలని అధికారులు నిర్ణయించిన ఓ రోడ్డు.. ఎండాడ నుంచి బీచ్ మార్గాన్ని కలుపుతుంది. రాజీవ్ స్వగృహ పక్క నుంచి వస్తూ..నౌకాదళ ఫైరింగ్ రేంజ్‌ను ఆనుకుని బేపార్క్‌కు సమీపంలో బీచ్ రోడ్డును కలుస్తుంది. ఎక్కువ మొత్తంలో రాజీవ్ స్వగృహకు చెందిన స్థలం నుంచి వెళ్తుంది. దీన్ని 2041 బృహత్తర ప్రణాళికలో.. వీఎంఆర్డీఏ అధికారులు 80 అడుగుల రోడ్డుగా ప్రతిపాదించారు. 40 అడుగులు చాలన్న.. రాజీవ్ స్వగృహ ప్రాజెక్ట్ జీఎం వినతికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ఎండాడలో రాజీవ్ స్వగృహకు.. 57.53 ఎకరాల భూమి ఉంది. ఇక్కడి స్థలం అమ్మకంతో.. రూ.12 వందల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. ఎక్కువ స్థలం రోడ్డుకు కేటాయించడం.. ఫలితంగా ప్లాట్లను కోల్పోవాల్సి రావడం వల్ల ఆదాయం తగ్గుతుంది. అందుకే కుదించే ప్రణాళిక చేశారని..స్థానికులు అంటున్నారు. రాజీవ్ స్వగృహ స్థలం పోతుందని భావిస్తే.. అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తం చేయాల్సిందని చెబుతున్నారు.