ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ తరహా ఘటన విదేశాల్లో జరిగితే..? - విశాఖ ఎల్జీ పాలిమర్స్ వార్తలు

ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరీన్ గ్యాస్ లీకేజీ ప్రమాదం విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చింది. 12 మంది ప్రాణాల్ని తీసింది. వందలమంది ఊపిరి తీసుకునేందుకు పరుగులు తీసేలా చేసింది. అయితే స్థానిక ప్రజల ఆరోగ్యం, భవిష్యత్ తరాల భద్రత, పర్యావరణానికి జరిగిన నష్టానికి ప్రభుత్వం, సదరు సంస్థ చెల్లించే మొత్తాలు ఏ మూలకన్నది ఇప్పుడు ప్రశ్న. భద్రత పట్టకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్వహరించిన కంపెనీలు భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి.

What if the Vishaka like incident happened in other countries, how they pay compensation
What if the Vishaka like incident happened in other countries, how they pay compensation

By

Published : May 9, 2020, 7:53 PM IST

ఆర్థిక వేత్త డాక్టర్ ఎస్. ఎస్. అనంత్​తో ముఖాముఖి

విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటనలో మనిషి ఆరోగ్య పరంగా, పర్యావరణ పరంగా జరిగిన నష్టంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ పాటిదని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కారణం... చట్ట పరంగా ఇంతకు పదింతల మేర పరిహారం బాధితులకు ఇవ్వాల్సి ఉంటుంది. విదేశాల్లో ఈ తరహా ప్రమాదాలు జరిగితే స్థానిక ప్రజలతో పాటు పర్యావరణాన్ని మెరగుపర్చేందుకు కూడా సదరు కంపెనీలు భారీస్థాయిలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా పారిశ్రామిక ప్రమాదాలప్పుడు వ్యక్తులు చనిపోతే.. ఆ వ్యక్తి సంపాదనా శక్తిని బట్టి కూడా పరిహారం చెల్లింపు ఉంటుంది. ఎంతకాలం ఆర్జింగలడన్న దానిపై విలువ నిర్ధరిస్తారు. దానికి లవ్ అండ్ అఫెక్షన్ పేరిట మరికొంత జోడించి పరిహారంగా చెల్లించటం ఓ తరహా విధానం. ఇది వ్యక్తిగత పరిహార చెల్లింపు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు అమెరికాలో ఎన్విరాన్​మెంటల్ ప్రాబ్లం అనే అంశంపై కీలకంగా దృష్టిసారిస్తారు. ఈపీ ప్రకారం మనిషి విలువ పది మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.

బీమా కల్పించాల్సిందే

భారత్​లో మాత్రం ఇలాంటి ప్రామాణిక అంశం ఏదీ లేకపోవటంతో ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ఇష్టాలపై ఆధారపడి పరిహారం చెల్లింపు ఉంటోంది. వాస్తవానికి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ మనిషిలోని నరాలు, మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణుల అభిప్రాయం. అయితే ఇది దీర్ఘకాలం ప్రభావం చూపుతుందా లేదా అన్న అంశం తేలాల్సి ఉంది. దీర్ఘకాలం దీని ప్రభావం మనిషి ఆరోగ్యంపై ఉండేట్టయితే ఈ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రత్యేకంగా వైద్యానికి సంబంధించిన అంశాలపై బీమా కల్పించాల్సిందే.

పర్యావరణంపై ప్రభావం

విశాఖ ఘటనలో పర్యావరణం కూడా తీవ్రంగా ప్రభావితం అయ్యింది. పశుపక్ష్యాదులతో పాటు, ఫ్యాక్టరీకి కనీసం మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పర్యావరణం, మొక్కలపై కూడా ఈ వాయువు ప్రభావం చూపింది. ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ ప్రారంభం కాగానే స్టైరీన్ వాయువు .. గాలిలోని ఆక్సిజన్ శాతాన్ని తగ్గించేసింది. దీనివల్ల పరిసర ప్రాంత ప్రజలు శ్వాసపరంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో పర్యావరణాన్ని వివిధ ప్రక్రియల ద్వారా శుభ్రపరచటం వంటి అంశాలను ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉంటుంది.

విదేశాల్లో భారీ పరిహారం

ఈ తరహా ఘటనలు విదేశాల్లో జరిగితే కనీసం వెయ్యి నుంచి 15 వందల కోట్ల రూపాయల మేర నష్ట పరిహారం సదరు సంస్థ చెల్లించాల్సి వచ్చి ఉండేదని అంచనా. ఎల్జీ పాలీమర్స్ నుంచి విడుదలైన విష వాయువుల దుర్ఘటన పర్యవసానంగా మనుషుల ప్రాణాలతో పాటు పశువులు, జంతువులు, పక్షుల ప్రాణాలకు, పంటలకు జరిగిన నష్టంతో పాటు పర్యావరణానికి జరిగిన నష్టాన్ని లెక్క తేల్చడానికి ఐదుగురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిందటే పరిస్థితి అంచనా వేయొచ్చు.

అమెరికా తరహాలో క్లాస్ యాక్షన్ లిటిగేషన్ విధానాన్ని దేశంలో జరిగే పారిశ్రామిక ప్రమాదాలప్పుడు ప్రభుత్వాలు అనుసరించాల్సి ఉందని సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఈ చట్టాలను పరిహారం చెల్లింపులోనూ మార్పులు చేయాల్సి ఉందని తేల్చి చెప్పింది. ఇలాంటి అంశాల్లో భారత రాజ్యంగంలోని 226, 32 అధికరణలు కూడా విశాలమైన ప్రజాప్రయోజనాలు దృష్టిలో ఉంచుకోవాలనే చెబుతున్నాయి.

ఇదీ చూడండి..

నిర్లక్ష్యమా.. యంత్రాంగ వైఫల్యమా.. వి'శోక' విపత్తుకు కారణాలేంటి..?

ABOUT THE AUTHOR

...view details