పర్యటకంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మన్యంపై.. గంజాయి సాగు చెడు ప్రభావం చూపుతోందని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు అన్నారు. దీన్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. గంజాయి సాగు ప్రభావిత గ్రామాల సంర్పంచ్లతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డీఐజీ.. గిరిజనలు గంజాయి సాగు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గంతలో కంటే చట్టాలు మరింత పటిష్టమయ్యాయని.. గంజాయి కేసుకు సబంధించి 20 ఏళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉందని హెచ్చరించారు.
తాము చేపట్టిన "పరివర్తన" కార్యక్రమంలో భాగంగా విశాఖ మన్యంలో సుమారు 120 ఎకరాలకుపైగా గంజాయి తోటలను గిరిజనలు స్వచ్ఛందంగా ధ్వసం చేశారని డీఐజీ స్పష్టం చేశారు. గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా ఐటీడీఏ అధికారులతో సంప్రదింపులు జరిపి పలు రకాల పంటలను ప్రొత్సహిస్తున్నామన్నారు. ఔషధ పంటలు సాగు చేయడం వల్ల ఆదాయం మెరుగ్గా ఉంటుందని సూచించారు. దీనిపై ప్రజాప్రతినిధులంతా విస్తృతంగా ప్రచారం చేసి గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలన చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులతో గంజాయి నిర్మూలనకు కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. సదస్సులో జిల్లా ఎస్పీ కృష్ణారావు, నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.