విశాఖ నగరమంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆహ్లాదకర వాతావరణం. ఎటు చూసినా పచ్చదనం, సుందర సాగరతీరం, పచ్చని కొండలు. ఈ వైవిధ్యాలే విశాఖకు ప్రత్యేక గుర్తుంపు తెస్తున్నాయి. కాలమేదైనా విశాఖలో అందాలకు కొదవేలేదు. వేసవిలో 40 డిగ్రీలకు మించని ఉష్ట్రోగతలు...వర్షాకాలంలో కొండలను కమ్మేసే మేఘాలు, చలికాలంలో అరకు, లంబసింగి అందాలు వర్ణణాతీతం. ఆంధ్రా ఊటీ సొగబులు పర్యాటకులను మైమరపిస్తాయి.
గిరులు...సుందర రమణులు
విశాఖ నగరం అనగానే ముందుగా గుర్తొచ్చేవి... పచ్చని కొండలు. సింహాచలేశుడు కొలువు తీరిన సింహగిరి, సాగర తీరంలోని యారాడ కొండ, కంబాల కొండ, బౌద్ధ భిక్షువులకు ఆవాసంగా నిలిచిన తొట్లకొండ... ఇలా విశాఖ చుట్టుపక్కల ఎటు చూసినా పసిడి వన్నెలతో కొండలు కనువిందు చేస్తుంటాయి.
ఎన్నెన్నో జాతులు
జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు సింహగిరి. ఈ కొండపై 300 రకాల మొక్కల జాతులు ఉన్నాయి. ఒకప్పుడు సింహగిరిపై సంపంగి తోటలు ఉండేవి. సువాసన వెదజల్లే సంపంగి తోటలు కాలనుగుణంగా కనుమరుగయ్యాయి. పుష్ప జాతి మొక్కలు, ఫల జాతి మొక్కలతో పాటు సింహగిరిపై ఉండే 14 వరకు జలధారలు... ఇక్కడి జీవవైవిధ్యానికి ఎంతగానో దోహదం చేసేవి. ఎన్నో రకాల పక్షులు, జంతువులకు సింహగిరి ఆవాసంగా ఉండేది.
వాతావరణ మార్పులతో చాలా జాతుల మొక్కలు నశించిపోయాయని నిపుణులు చెబుతున్నారు. జలధారల్లో ఇప్పుడు 8 వరకు మాత్రమే కనిపిస్తున్నాయి. గంగధార, చాకిదార, అనంతామృతదార... సీతమ్మదార, మాధవదార తప్పమిగిలిన వాటిలో అంతంత మాత్రంగానే నీటి ప్రవాహం ఉంటోంది. ఈ కొండపై 9 రకాల పనస, 6 రకాల సంపంగి, సీతాఫలం, రామఫలం, లక్ష్మణఫలం ఇంకా ఎన్నో రకాల ఫలాలు ఉండేవి. మారుతున్న కాలంతో పాటు అడవిలోకి వెళ్లే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గడంతో ఈ మెక్కలూ అంతరించిపోతున్నాయి.