దేశ ఆర్థిక వ్యవస్థలో నౌకాయాన రంగానిది కీలక పాత్ర అని.. దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు(vice president venkaiah naidu) అన్నారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న వెంకయ్య.. విస్తరణ ప్రణాళికలను తెలుసుకున్నారు. ఆయన్ను కలిసిన పోర్ట్ ఛైర్మన్ రామ్మోహన్ రావు, ఇతర అధికారులు.. పోర్టు పురోగతికి సంబంధించిన వివిధ అంశాలను తెలియజేశారు. 103 ఎకరాల్లో రూ.406 కోట్లతో ఫ్రీ ట్రేడ్ అండ్ వేర్‌హౌజింగ్ జోన్(ఎఫ్‌టీడబ్ల్యూజెడ్) ఏర్పాటు విషయాన్ని ఉపరాష్ట్రపతికి ట్రస్టు ఛైర్మన్ వివరించారు.ఈ సందర్భంగా ఇతర అంశాల్లోనూ ట్రస్టు సాధిస్తున్న పురోగతిని ఉపరాష్ట్రపతి అభినందించారు.
పోర్టుల ఆధారిత అభివృద్ధి..
భారతదేశంలో నౌకాయాన మౌలిక వసతుల గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి.. దేశంలో పోర్టుల ఆధారిత అభివృద్ధిని విస్తృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాగర్‌మాల’ కార్యక్రమాన్ని(sagaramala) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంతో 504 ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. దీంతోపాటుగా రూ.3.57లక్షల కోట్ల మౌలిక వసతులు సమకూరుతున్నాయన్నారు.