అమెరికాకు చెందిన సుప్రసిద్ధ విమాన వాహక అణు యుద్ధనౌక యూఎస్‌ఎస్ కార్ల్ విన్సన్ (సీవీఎన్-70) విశాఖ తీరానికి వచ్చింది. బంగాళాఖాతంలో జరుగుతున్న మలబార్ ఫేజ్-2 విన్యాసాల్లో పాల్గొనడానికి దాన్ని అమెరికా నౌకాదళం విశాఖకు పంపింది. యుద్ధవిన్యాసాల్లో అత్యంత ఖరీదైన విమాన వాహక యుద్ధనౌకలను వినియోగించడం చాలా తక్కువగా ఉంటుంది. విశాఖ కేంద్రంగా త్వరలో భారత్‌కు చెందిన విమాన వాహక యుద్ధనౌక విక్రాంత్‌ను మోహరించనున్న నేపథ్యంలో తాజా విన్యాసాల్లో అమెరికాకు చెందిన యూఎస్‌ఎస్ కార్ల్‌విన్సన్ రావడం విశేషం.
ప్రత్యేకతలెన్నో..
అమెరికా నౌకాదళంలో యూఎస్‌ఎస్ కార్ల్‌విన్సన్ విమాన వాహక యుద్ధనౌకను 1980లో ప్రవేశపెట్టారు. జార్జియాకు చెందిన ప్రముఖ నాయకుడు కార్ల్ విన్సన్ యూఎస్ నౌకాదళానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన పేరును దీనికి పెట్టారు. 1983 నుంచి ఇది సేవలందిస్తోంది. కాలానుగుణంగా అత్యాధునిక సదుపాయాలతో ఆధునికీకరిస్తూ ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు తీర్చిదిద్దారు. సాధారణ విమాన వాహక యుద్ధనౌకలతో పోలిస్తే దీని పరిమాణం, సౌకర్యాలు అన్నీ భారీగానే ఉంటాయి.
- దీనిపై నుంచి క్షిపణులను కూడా ప్రయోగించవచ్చు. యుద్ధనౌక లక్ష్యంగా వచ్చే క్షిపణులను, టోర్పెడోలను క్షణాల్లో గుర్తించగలిగే అధునాతన వ్యవస్థలన్నీ ఇందులో ఉన్నాయి.
- శత్రుదేశాలపై ఒక్కసారిగా దాడి చేయడానికి వీలుగా దీనిపై అధునాతన యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు ఉంటాయి.
- ఈ నౌక ఇరాక్ యుద్ధంతోపాటు ‘డిసర్ట్ స్ట్రైక్’, ‘సదరన్ వాచ్’, ‘ఎండ్యూరింగ్ ఫ్రీడం’ తదితర ఆపరేషన్లలో కీలకపాత్ర పోషించింది.