జీవితంలో మధురమైన జ్ఞాపకాలను పదికాలాలపాటు పదిలంగా ఉంచేదే ఫొటో. కాలానుగుణంగా ఫొటోలు తీసే విధానంలో మార్పు వచ్చిందే తప్ప మనుషులతో ఫొటోకు ఉన్న అనుబంధం మాత్రం మారలేదు సరికదా... ఇంకా ఇంకా మక్కువ పెరిగింది. అందుకే లక్షల రూపాయలు వెచ్చించి మరీ ఫొటోషూట్‌లు నిర్వహిస్తున్నారు. ఘనంగా నిర్వహించే శుభకార్యాలను పదిలపరుచుకునేందుకు ఎడిటింగ్ నైపుణ్యాలను జోడించి సినిమాలకు ఏమీ తగ్గకుండా వీడియోలను రూపొందించడం సరికొత్తగా ట్రెండ్‌గా మారిపోయింది. అలాంటి వారి కోసం ఒక ఆర్ట్ గ్యాలరీ, షూట్ స్పాట్ ను రూపొందించారు విశాఖ వాసి. ఎక్కడో విదేశాల్లో ఉన్న అనుభూతిని కల్పించేలా ఆయన సిద్ధం చేసిన మినీ సినీ సెట్టింగ్ గ్యాలరీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రత్యేకంగా సెట్ల రూపకల్పన...
బీఎఫ్ఏ పూర్తి చేసి, శిల్పిగా ఇప్పటికే గుర్తింపు పొందిన రమణమూర్తి ఉత్తరాంధ్రలోనే కాదు.. ఎక్కడ విగ్రహాలు రూపొందించాలన్నా అందుకు అనుగుణంగా పనిచేసే నైపుణ్యాన్ని సాధించారు. తరుచుగా ఫొటో షూట్లకు సంబంధించి వివిధ అంశాలను పరిశీలించిన ఈయన రెండున్నర ఎకరాల స్థలంలో ప్రత్యేకంగా సెట్ లు రూపకల్పన చేశారు.