Vizag-Chennai industrial corridor: విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ తొలిదశ ప్రాజెక్టులో 62% పురోగతి ఉన్నట్లు కేంద్ర నౌకాయానం, ఓడరేవుల శాఖ లోక్‌సభకు తెలియజేసింది. తెదేపా ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు నౌకాయాన, ఓడరేవుల శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ బదులిచ్చారు. ఈ పారిశ్రామిక కారిడార్‌లో విశాఖపట్నం, మచిలీపట్నం, దొనకొండ, శ్రీకాళహస్తి-యేర్పేడు, కడప నోడ్‌లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆర్ధిక సాయంతో విశాఖపట్నం నోడ్‌లో నక్కపల్లి, రాంబిల్లి, శ్రీకాళహస్తి-యేర్పేడు నోడ్‌లో చిత్తూరు సౌత్ పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ఉద్దేశించినట్లు తెలిపారు. ఇందుకోసం దశలవారీగా ఆరిక చేయూత అందిస్తున్నారని చెప్పారు. మొదటి దశ ప్రాజెక్టు 867.97 కోట్ల రూపాయల వ్యయం జరిగిందని... పనుల్లో 62% పురోగతి కనిపించిందని చెప్పారు.
ఈ పారిశ్రామిక కారిడార్‌లో ప్రతిపాదించిన పారిశ్రామిక క్లస్టర్లు అన్నీ కొత్తవేనని, ఇందులో ఇంకా పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉన్నట్లు వివరించారు. మరోవైపు విశాఖపట్నం పోర్టులో టర్నరౌండ్ సమయం పెరిగినట్లు కేంద్రమంత్రి సమాధానంలో పేర్కొన్నారు. సాగరమాల కార్యక్రమం కింద పోర్టుల ఆధునీకరణ, అనుసంధానం కోసం విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మొత్తం 5,293 కోట్ల రూపాయల విలువైన 28 ప్రాజెక్టు పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో 1,293 కోట్ల రూపాయల విలువైన 12 ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయని, 1,114 కోట్ల రూపాయల విలువైన 3 ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని వెల్లడించారు.