ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వర్షం కురిసింది... ఆనందం వెల్లివిరిసింది - andhrapradesh

రాష్ట్రాన్ని ఊరించి ఉసూరుమనిపిస్తున్న వానలు కాస్త కరుణించాయి. చాలా ప్రాంతాల్లో జోరు వర్షాలు కురిశాయి. గుంటూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో రోడ్లు జలమయమయ్యాయి. చేలకు పదును కోసం ఎదురుచూస్తున్న రైతులు...ఈ వానలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

rains_in_andhrapradesh

By

Published : Aug 18, 2019, 11:37 PM IST

కురిసింది వర్షం..అన్నదాత కళ్లల్లో ఆనందం

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. గుంటూరులో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. వర్షపునీరు అధికంగా చేరటంతో... నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. గుంటూరు జిల్లా బాపట్లలో కురిసిన వర్షానికి... కాలువలు నిండి మురుగునీరు రహదారులపై నిలిచిపోయింది. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వానలు కురియటంతో....నాట్లు వేసేందుకు అవకాశం కలిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతిలో రెండురోజులుగా వర్షం కురుస్తోంది. తెల్లవారుజామునే మొదలైన వాన... అంతరాయం లేకుండా కురుస్తోంది. వారాంతం కావటంతో...తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎడతెరపిలేని వర్షంతో ఇబ్బందులు పడ్డారు.

వానల రాకకోసం ప్రత్యేక పూజలు చేస్తూ...వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అనంతపురం జిల్లా కల్యాణదుర్గం వాసులకు వానరాక సంతోషాన్నిచ్చింది. కల్యాణదుర్గంలో మోస్తరు వర్షం కురవటంతో... రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్షంతో ఉపశమనం కలిగిందని స్థానికులు చెబుతున్నారు.

ప్రకాశం జిల్లా చీరాలలో భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి...రహదారులు నీటమునిగాయి. ప్రధాన రహదారులు జలమయం కావటంతో...వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మన్యం, మెట్ట, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రాజమహేంద్రవరంలో సాయంత్రం కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. రహదారులపై డ్రైనేజీ నీరు పొంగి పొర్లింది. రైల్వే లోబ్రిడ్జి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు బస్సులు దిగి వెళ్లిపోయారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details