జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు ప్రాదేశిక స్థానాలకు నామపత్రాల స్వీకరణ బుధవారం ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం 10.30 గంటలకు మొదలైన ప్రక్రియ రాత్రి 9.20 గంటలకు ముగిసింది. నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకే నామపత్రాలను స్వీకరించాలి. నిర్ణీత గడువు ముగిసే సమయానికి భారీగా అభ్యర్థులు టోకెన్లు తీసుకున్నారు. దీంతో అధికారులు సమయం పొడిగించారు. గడువు ముగిసేలోగా జడ్పీ హాలు లోపలికి వచ్చిన వారందరికీ నిబంధనల ప్రకారం అవకాశం ఇవ్వొచ్ఛు సాయంత్రం 5 గంటలవరకు 120 మంది నామపత్రాలు దాఖలు చేయగా.. రాత్రి 8 గంటల సమయానికి ఆ సంఖ్య 220కి చేరింది. చివరకు రాత్రి 9.20 గంటలకు ముగిసింది.
చివరి రోజు భారీగా...
నామపత్రాల స్వీకరణ మొదలైన తొలిరోజు ముగ్గురు మాత్రమే నామపత్రాలు దాఖలు చేశారు. రెండో రోజు మంగళవారం కేవలం 15 మందే వేశారు. మూడో రోజు మాత్రం 238 మంది 295 సెట్లను జడ్పీ సీఈవో, ఆర్‌వోకు అందజేశారు. దీంతో జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. వీటిని అధికారులు గురువారం పరిశీలిస్తారు. తిరస్కరణకు గురైన నామపత్రాలపై అప్పీలుకు 13వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు గడువు ఉంది. అప్పీళ్లను కలెక్టరు వద్ద వేయాల్సి ఉంది. ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటలకు అభ్యర్థుల తుది జాబితా వెల్లడవుతుంది. అదే రోజు గుర్తులను కేటాయిస్తారు.