విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. దిల్లీకి చేరిన ఉద్యమాన్ని ప్రజాకవులు, సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. సినీనటుడు ఆర్. నారాయణమూర్తి విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్టీలకు అతీతంగా జంతర్ మంతర్ వద్ద తెలుగు వారి తరఫున గళం వినిపించిన నాయకులు, కార్మికులను ఆయన అభినందించారు. 35 మంది ప్రాణాలను త్యాగం చేసి సాధించిన విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేస్తాం లేదంటే మూసివేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించడాన్ని నారాయణమూర్తి తప్పుబట్టారు. కర్మాగారానికి అవసరమైన గనులు కేటాయించకుండా నష్టాల్లోకి తెచ్చారని.. ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయడం సరైన నిర్ణయం కాదని, నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజా కవి, ఉద్యమకారిణి విమలక్క సైతం స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి తన మద్దతు తెలియజేశారు. అధిక ఎరువులతో భూమి సారాన్ని కోల్పోతున్న ఈ సమయంలో.. ఓ ప్రైవేటు కంపెనీ విశాఖలో తలపెట్టదలచిన వ్యాపార నిర్ణయాన్ని ఆమె తప్పుపట్టారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి భూసారాన్ని, వ్యవసాయ విధానాలను మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని విమలక్క సూచించారు. అన్నదాతలు అటువైపు అడుగులు వేయాలని అన్నారు.