ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

minister alla nani : 'సీజనల్‌ వ్యాధుల కట్టడికి చర్యలు చేపట్టండి'

విశాఖ జిల్లాలో సీజనల్ వ్యాధులపై వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. సీజనల్‌ వ్యాధుల కట్టడికి సంబంధిత శాఖల అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైతే విషజ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయో అక్కడ ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. సీజనల్‌ వ్యాధులపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

minister alla nani
మంత్రి ఆళ్ల నాని

By

Published : Sep 8, 2021, 12:35 AM IST

Updated : Sep 8, 2021, 6:46 AM IST

వర్షాల నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల కట్టడికి సంబంధిత శాఖల అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. సోమవారం విశాఖ కలెక్టరేట్‌ ఎస్‌.ఆర్‌.శంకరన్‌ సమావేశ మందిరంలో జిల్లాలో సీజనల్‌ వ్యాధుల కట్టడిపై కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నా కొన్ని ప్రాంతాల్లో అక్కడి పరిస్థితులు, పారిశుద్ధ్య లోపాలతో సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. పంచాయతీరాజ్‌, పురపాలక, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. జిల్లాలో డెంగీ 276, మలేరియా 13 కేసులు, గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలో డెంగీ 104, ఇతర పురపాలక ప్రాంతాల్లో 133 కేసులు నమోదయ్యాయన్నారు. కేసులు ఎక్కువగా వచ్చిన ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధుల నిర్మూలనలో భాగంగా గుంటూరుకు ప్రాంతీయ సంచాలకులు వాణిశ్రీ ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాలని రోగుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయన్నారు. రక్తం, ప్లేట్‌లెట్స్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిల్వలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. వైద్య శిబిరాల ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌కు సూచించారు. డెంగీ నిర్ధారణ పరీక్ష చేసేందుకు వినియోగించే ఎలిసా కిట్‌లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటిలో అవసరమైనన్ని అందుబాటులో ఉంచుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర అధికారులకు సమాచారం ఇచ్చి తెప్పించుకోవాలన్నారు. ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి స్వచ్ఛత కార్యక్రమాలు అమలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

గృహాలు, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించి, రక్త పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. డెంగీ, మలేరియా సోకిన వారికి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని జేసీ దినేష్‌కుమార్‌ తెలిపారు. గుంటూరు- 1, 2, తాడికొండ, పొన్నూరు ఎమ్మెల్యేలు మహమ్మద్‌ ముస్తఫా, మద్దాళి గిరిధర్‌, ఉండవల్లి శ్రీదేవి, కిలారి రోశయ్య మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధుల కట్టడికి అధికారులకు సూచనలు చేశారు. జాతీయ కీటక జనిత రోగ నియంత్రణ కార్యక్రమాల ప్రచార పోస్టర్‌, వైద్య ఆరోగ్య శాఖ నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్న వైద్య సేవల ప్రచార ప్రతులను మంత్రులు, కలెక్టర్‌ ఆవిష్కరించారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, ఏపీవీపీ కమిషనర్‌ వినోద్‌కుమార్‌, వైద్యారోగ్య శాఖ డైరెక్టర్‌ గీత ప్రసాదిని, వైద్య విద్య డైరెక్టర్‌ డాక్టర్‌ రాఘవేంద్రరావు, జేసీ శ్రీధర్‌రెడ్డి, డీఆర్వో కొండయ్య, వైద్య, ఆరోగ్య, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

CM Jagan: నూతన విద్యా విధానం అమలుకు సిద్ధం కావాలి: ముఖ్యమంత్రి జగన్

Last Updated : Sep 8, 2021, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details