‘నాన్నా... నేను బతికే ఉన్నాను. నేను మరో పెళ్లి చేసుకున్నా. మేము ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. ఒకర్ని వదిలి మరొకరం ఉండలేం. అతనేమీ బలవంతం చేసి తీసుకురాలేదు. దయచేసి మా కోసం వెతకొద్ధు ఇక పరిగెత్తే ఓపిక నాకు లేదు. ఇక చావైనా, బతుకైనా అతనితోనే. నాకు బతకాలని ఉంది. నా గురించి వెతికితే ఇద్దరం కలిసే చచ్చిపోతాం.నా కోసం వెతికిన అధికారులను క్షమించమని వేడుకుంటున్నా’ - ఆర్‌కే బీచ్‌లో సోమవారం అదృశ్యమైన వివాహిత నుంచి బుధవారం రాత్రి వచ్చిన సమాచారం ఇది.
విశాఖ నగరంలోని ఆర్.కె.బీచ్‌కు భర్తతో కలిసి వచ్చి ఊహించని విధంగా అదృశ్యమైన వివాహిత(22) కేసులో మిస్టరీ బుధవారం వీడింది. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సముద్రంలో మునిగిపోయి ఉంటుందని భావించి పోలీసులు, నౌకాదళం, తీరభద్రతా దళం అధికారులు భారీఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖ తీరం నుంచి సముద్రం వైపు కిలోమీటర్ల మేర హెలీకాప్టర్లలో గాలించారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభ్యం కాలేదు.
మరో వైపు ఆమె భర్త చెప్పిన విషయం వాస్తవమా? కాదా? అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. కొందరు ఆయన్నూ అనుమానించారు. అయితే బుధవారం రాత్రి అనూహ్యంగా ‘నేను క్షేమంగానే ఉన్నాను’ అనే సంక్షిప్త సమాచారం ఆమె కుటుంబీకులకు పంపించారు.
పెళ్లి రోజునాడే అదృశ్యం:హైదరాబాద్‌లో పని చేస్తున్న యువకుడితో ఈమెకు 2020లో పెళ్లయింది. ఇటీవల ఆమె పుట్టింటికి వచ్చారు. ఈ నెల 25న వీరి పెళ్లి రోజు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆర్కేబీచ్‌కు చేరుకున్నారు. తీరానికి దగ్గరగా ఉన్న రాళ్లపై కూర్చొని చాలా సేపు గడిపారు. కొంత సమయం తరువాత భర్తకు సెల్‌ఫోన్ ఇచ్చి కాళ్లు శుభ్రం చేసుకొని వస్తానని వెళ్లింది. అతను సెల్ చూస్తుండిపోగా... కొద్దిసేపటికి ఆమె అక్కడ లేదని గుర్తించాడు. దీంతో సముద్రంలో కొట్టుకుపోయిందేమోనని ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు హెలీకాప్టర్లు, 10 మంది గజ ఈతగాళ్లు, రెండు స్పీడ్‌బోట్లతో మంగళవారం గాలింపు చర్యలు చేపట్టారు. మేయర్, డిప్యుటీ మేయర్ కూడా సమీక్షించారు. ఆమె నెల్లూరులో ఉన్నట్లు తెలుస్తోందని డిప్యూటీ మేయర్ శ్రీధర్ బుధవారం మధ్యాహ్నం ప్రకటించడంతో ఆమె ఎక్కడి ఉన్నది ప్రాథమికంగా తెలిసింది. పోలీసులు యువతి కుటుంబీకులను విచారించి కొంత సమాచారం రాబట్టారు. దీంతో ఈ కేసులో కొంత స్పష్టత వచ్చింది. బుధవారం రాత్రి మరో పెళ్లి చేసుకున్న చిత్రాలను ఆమె కుటుంబీకులకు పంపారు. ‘ఆమె విశాఖ నుంచి కావలి... ఆ తరువాత బెంగళూరు వెళ్లినట్లు తెలిపారు. మరో వివాహం కూడా చేసుకున్నారు. త్వరలో విశాఖ వస్తానని కుటుంబీకులకు తెలిపారు’ అని విశాఖ మూడో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ కె.రామారావు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: