విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం కళ తగ్గుతోంది. గతంలో నగరం నుంచి 5 దేశాలకు అంతర్జాతీయ సర్వీసులు నడిచేవి. ప్రస్తుతం సంఖ్య క్షీణిస్తోంది. తాజాగా విశాఖ - బ్యాంకాక్ సర్వీసు అక్టోబర్ ఒకటి నుంచి నిలిచిపోనుంది. ఈ విమానాల బుకింగ్‌ను వెబ్ సైట్ నుంచి తొలగించారు. వారానికి 4 రోజుల నడిచే ఈ సర్వీసులో ఏరోజూ ఆక్యుపెన్సీ తక్కువగా లేదు. అంత రద్దీ ఉన్న సర్వీసు రాత్రి 12 గంటలకు మొదలవుతుంది. నౌకాదళం ఆధీనంలో విమానాశ్రయం ఉన్నందున... రాత్రి సమయంలో విమానాల స్లాట్‌లను కొనసాగించలేమని నేవీ స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో సర్వీసులను నిలిపివేయక తప్పని పరిస్ధితి నెలకొంది.
సింగపూర్‌కి వెళ్లే సిల్క్ ఎయిర్ వేస్ విమాన సర్వీసూ అక్టోబర్ 27 నుంచి నిలిచిపోనుంది. ఇప్పటికే శ్రీలంకకు సర్వీసులు ఆగిపోయాయి. తాజాగా రెండు సర్వీసులూ నిలిచిపోతే ...ఇక కేవలం మలేషియాకు మాత్రమే సర్వీసులు ఉంటాయి. ఎయిర్ ఇండియాలో నెలకొన్న సంక్షోభంతో దుబాయ్ సర్వీసు ఏ క్షణమైనా ఆగిపోవచ్చు. దీనితో పర్యాటక నగరానికి తీవ్ర నష్టం వాటిల్లనుంది. విశాఖ విమానాశ్రయానికి ప్రధాన సమస్యగా ఉన్న స్లాట్ ఇబ్బందులను అధిగమించేందుకు నేవీతో చర్చిస్తామని ప్రభుత్వం చెబుతోంది. విభజన తర్వాత విశాఖ నుంచి పెద్ద ఎత్తున అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమైనా...ప్రస్తుతం వాటి కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది.