ఖరీదైన భవనాల్లో నివాసం, లగ్జరీ కార్లు, విలాసవంతమైన జీవితం... మెట్రోనగరం విశాఖ గురించి తలచుకోగానే ప్రతి ఒక్కరి మదిలో మెదిలే అంశాలు ఇవే. కానీ ఇవన్నీ నాణేనికి ఒకపక్కే. ఉక్కు నగరంలోనూ కూడూ, గూడూలేక రోడ్లపైనే జీవనం సాగిస్తున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు. ఎలాంటి రక్షణ లేకుండానే రహదారులనే ఆవాసులుగా చేసుకుని జీవిస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య సుమారు 4 వేలకు పైగానే ఉంటుందని అంచనా. ఏయూటీడీ సంస్థ చేసిన సర్వేలో నిరాశ్రయుల్లో 20 శాతం ఒంటరి మహిళలు ఉండగా....10శాతం మంది మానసిక సమస్యలతో బాధపడే వారు ఉన్నట్లు తేలింది. ఇలాంటి వారిని చేరదీసి షెల్టర్ హోమ్స్‌కు తరలించి వారికి సరైనా కౌన్సిలింగ్ చేస్తే తిరిగి సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంది.
కొరవడిన సర్కార్ సాయం... నిరాశ్రయుల దుర్భర జీవితం - vizag city latest news
ప్రజల కనీస అవసరాల్లో కూడు, గూడు తప్పనిసరి. కానీ కుటుంబాలకు దూరమైన కొందరు...మానసిక సమస్యలతో మరికొందరు..నా అనే వాళ్లు లేక రోడ్లపైనే తలదాచుకుంటున్నారు. ఎండకు ఎండుతూ...వర్షానికి తడుస్తూ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. వీరికి ప్రభుత్వం షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేసి కాస్త ఆసరాగా నిలిస్తే వీరిలో చాలామంది సాధారణ జీవితం గడపగలరు. కానీ ప్రభుత్వం చొరవ చూపకపోవటంతో దిక్కులేని వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
జీవీఎంసీతో కలిసి ఏయూటీడీ సంస్థ కొన్ని షెల్టర్ హోమ్స్‌ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం నగరంలో 8 నిరాశ్రయ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి లక్ష మందికి ఒక కేంద్రం ఉండాలి. దీని ప్రకారం ఒక్క విశాఖలోనే 17 కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న కేంద్రాల్లో కేవలం 4 వందల మందికి మాత్రమే ఆశ్రయం కల్పిస్తున్నారు. పైగా మానసిక రోగులకు ప్రత్యేక చర్యలు చేపట్టకపోవడం వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.
స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న నిరాశ్రయ కేంద్రాలకు సైతం అధికారులు సరైన రీతిలో సహకారం అందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్ కాలంలో ఈ సంస్థలు ఎంతోమందికి ఆశ్రయం కల్పించి చేయూతనందించాయి. ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటి వరకు చెల్లింపులు జరగకపోవడంతో సిబ్బందికి కనీసం జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విశాఖ నగరంలో రోజు వారీ కూలీనాలీ చేసుకునేందుకు వచ్చే ఎంతో మంది సైతం రాత్రి వేళల్లో రహదారులపైనే నిద్రిస్తుంటారు. ఇలాంటి వారి కోసం తాత్కాళిక షెల్టర్ హోమ్స్‌ను ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి.