ఎల్జీ గ్యాస్ లీక్ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ విచారణ ప్రక్రియ పూర్తైంది. మూడో రోజు జీవీఎంసీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో... మహా నగరపాలక సంస్థ అధికారులు ప్రమాద సమయంలో చేపట్టిన సహాయక చర్యల గురించి కమిటీకి వివరించారు. పత్రిక ప్రతినిధుల నుంచి సైతం కమిటీ వివరాలు సేకరించింది. ఇవాళ్టి ప్రక్రియతో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వళవన్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, పోలీస్ కమిషనర్ ఆర్ కె మీనా సభ్యులుగా ఉన్న హై పవర్ కమిటీ 3 రోజుల విచారణ పూర్తి చేసింది.
అభిప్రాయాల సేకరణ
దర్యాప్తులో భాగంగా బాధితులతో సమావేశమైన కమిటీ సభ్యులు ప్రమాద సమయంలో పరిస్థితులను అడిగి తెలుసుకొన్నారు. బాధిత గ్రామాలకు ప్రభుత్వం ఏ విధంగా సాయం అందించాలి అనే విషయంపై అభిప్రాయాలు సేకరించారు. ఆయా కుటుంబాలు కోరిన రీతిలో వైద్య సేవలు, పరీక్షలు జరుగుతాయని భరోసా ఇచ్చారు. స్టైరీన్ ప్రభావానికి గురైన మరిన్ని ఇతర ప్రాంతాలకూ ప్రభుత్వ సదుపాయాలు విస్తరించాలంటూ అందిన వినతులను కమిటీ పరిగణనలోకి తీసుకొంది. ఉపాధి కోల్పోయే ప్రమాదంలో పడిన 5 వందల మంది స్థానికుల తరపునా కమిటీకి వినతులు అందాయి.
3 రోజుల విచారణలో వివిధ శాఖల అధికారులు, పత్రికా ప్రతినిధులు, రాజకీయ పక్షాల నుంచి సైతం కమిటీ వివరాలు సేకరించింది. ఆంధ్ర విశ్వ విద్యాలయం, కేంద్ర ప్రభుత్వ సలహా కమిటీ నిపుణుల అభిప్రాయాలూ అడిగి తెలుసుకొంది. ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ ప్రతినిధులూ హై పవర్ కమిటీని కలిసి ప్రమాదం జరిగిన తీరును వివరించారు. కంపెనీ అనుసరించే భద్రతా ప్రమాణాల గురించి కమిటీ ప్రశ్నలు సంధించింది. రసాయన ట్యాంకులు నిర్మించిన విధానం, శీతలీకరణ చేసేటపుడు తీసుకునే జాగ్రత్తల గురించి అడిగింది. ట్యాంకులో ఉన్న స్టైరీన్ పరిమాణం, గాలిలో కలిసిన స్థాయిల వివరాలు తెలుసుకొంది.