Murder: విశాఖలోని 51వ వార్డు గాంధీనగర్ ప్రాంతానికి చెందిన రేబాక సాయితేజ (22) ఫొటోగ్రఫీ చేస్తుంటాడు. ఇదే ప్రాంతంలోని మహత్‌కాలనీకి చెందిన అతడి స్నేహితుడు మోహన్ గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో ఫోన్ చేసి, రైల్వే క్వార్టర్స్ గ్రౌండ్స్ వద్ద పాత స్నేహితులు ఉన్నారని, మద్యం తాగుదాం రమ్మని పిలిచాడు. దీంతో తేజ మరో ముగ్గురు స్నేహితులతో వెళ్లాడు. అక్కడ మద్యం మత్తులో ఉన్న గ్రీన్‌గార్డెన్స్‌కు చెందిన బంగారు రాజు బ్యాచ్‌కు, తేజకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో బంగారు రాజు బ్యాచ్‌కు సంబంధించిన యువకులు కత్తులు, రాడ్లు, కర్రలతో తేజపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు అతడు రైల్వే క్వార్టర్స్ వైపు పరుగులు తీశాడు. క్వార్టర్స్ పైకి వెళ్లిన అతడిని కిందకు తీసుకువచ్చి కొబ్బరిబొండాలు కొట్టే కత్తితో తలపై, వీపుపై నరుకుతూ, రాడ్లతో కొట్టడంతో మళ్లీ పరుగెత్తాడు. అతడిని వెంబడించి రైల్వేక్వార్టర్స్ నీటి ట్యాంకర్ వద్ద కొట్టి చంపేశారు.
చంపేసి.. తప్పుదోవ పట్టించేలా:హత్య అనంతరం నిందితులు తమకేమీ తెలియదన్నట్లుగా.. తేజ తన స్నేహితులతో కలసి తమపై దాడికి పాల్పడ్డాడంటూ అర్థరాత్రి 2.30 గంటల సమయంలో ఎయిర్‌పోర్టు స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో నిందితులైన బంగారురాజు, రవి, మరో ముగ్గురు ఉన్నారు. వీరంతా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఇలా స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. స్టేషన్‌లో ఫిర్యాదు తీసుకున్న కానిస్టేబుల్ తెల్లవారాక వచ్చి విచారిస్తామని చెప్పడంతో వెళ్లిపోయారు.
పోలీసుల పరిశీలన:శుక్రవారం తెల్లవారుజామున క్వార్టర్స్ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో ఆడుకునేందుకు వచ్చిన పలువురు యువకులు అచేతనంగా పడిఉన్న తేజను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎయిర్‌పోర్టు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి, హత్యకు గల కారణాలను నమోదు చేశారు. క్రైం ఏసీపీ పెంటారావు, ఎయిర్‌పోర్టు సీఐ ఉమాకాంత్‌తో పాటు ఆర్పీఎఫ్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆ ప్రాంతానికి చేరుకొని పలు ఆధారాలను సేకరించింది.