Drugs: విశాఖలో డ్రగ్స్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ చదువుతున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..53 గ్రాముల ఎండిఎంఎ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా డ్రగ్స్ దందా మూలాలను అన్వేషించే పనిలో పడ్డారు.
విశాఖలో డ్రగ్స్ కలకలం..53 గ్రాముల మాదకద్రవ్యాలు స్వాధీనం - పోలీసుల అదుపులో ముగ్గురు
12:07 April 13
పోలీసుల అదుపులో ముగ్గురు
విశాఖ చినవాల్తేర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌పై పోలీసుల దాడి చేయడంతో ఈ డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. చినవాల్తేర్కు చెందిన కె. అవినాష్,.. మురళీనగర్కి చెందిన ఎ.శ్రీవాత్సవ్, సీతమ్మధారకు చెందిన వి. అవినాష్ నాయుడు ముగ్గురూ స్నేహితులు. అనినాష్ బెంగళూరుకు చెందిన తరుణ్, శ్రీకర్ల వద్దకు వెళ్లి 53గ్రాముల ఎండిఎంఎ పౌడర్‌ను గ్రాము రెండు వేల రూపాయలకు కొనుగోలు చేసి విశాఖ తీసుకువచ్చారు. గతంలోను ఇలాగే తెచ్చి అమ్మడంతో.. పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది. ఈసారి కూడా అదే మాదిరిగా చేయాలని భావించారు.
గ్రాము చొప్పున 53 పొట్లాలుగా సిద్దం చేసి వాటిని గ్రాము ఐదు వేల రూపాయలకు విక్రయానికి నిర్ణయించుకున్నారు. ఈ సమాచారం అందుకున్నపోలీసులు అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మూడో పట్టణ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ దాడిలో పాల్గొన్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంతో బెంగళూరుకు సంబంధం ఉండటంతో అక్కడి పోలీసులకు సమాచారమిచ్చి.. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: గుత్తేదారుకే కానుక.. గతేడాది కంటే రూ.92 కోట్లు అదనం