విశాఖకు కోటనరనకు చెందిన జగదీశ్, హేమలత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు చంద్రశేఖర్ పుట్టుకతో జన్యులోపం కారణంగా మాటలు రావు.. అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగింది. బయట ఆడుకుంటున్న ఆ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో నోటిపై తీవ్ర గాయాలయ్యాయి. మూడు నెలల క్రితం చిన్న కుమారుడిని కూడా శునకాలు గాయపరిచాయని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన చంద్రశేఖర్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారన్నారు.
DOGS ATTACK: కుక్కల దాడిలో గాయపడిన చిన్నారి - విశాఖలో కుక్కల సంచారం
కుక్కలు ఆ కుటుంబం పాలిట యమపాశాలుగా మారాయి. చిన్న కుమారుడిని శునకాలు గాయపరిచి మూడు నెలలు కాక ముందే.. పెద్ద కుమారుడిని కూడా తీవ్రంగా గాయపరిచాయని ఆవేదన చెందారు ఆ చిన్నారుల తల్లిదండ్రులు. అసలే పుట్టుకతో మాటలు రాక, గుండె జబ్బు వంటి సమస్యలతో బాధ పడుతున్న పెద్ద కుమారుడిని.. ఈ గాయాలు మరింత బాధిస్తున్నాయని ఆవేదన చెందారు.
నిన్న సాయంత్రం కుక్కలు మరికొందరిని కూడా గాయపరిచినట్లు స్థానికులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న పశువైద్యశాలలో నగరంలోని కుక్కలను తీసుకువచ్చి కు.ని. ఆపరేషన్లు నిర్వహించి.. అనంతరం అక్కడే వదిలేసి వెళ్తున్నారని కాలనీవాసులు తెలిపారు. దీంతో గ్రామంలో శునకాల తాకిడి అధికంగా ఉందని అన్నారు. వాటి దాడిలో 5 ఆవులు గాయపడి మృతి చెందాయన్నారు. ఏడాదికాలంలో కుక్కల సంచారం ఎక్కువైందని.. జీవీఎంసీ ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని స్థానికుల హెచ్చరించారు.
ఇదీ చదవండీ..MURDER: వివాహేతర సంబంధాన్ని నిలదీసిందని.. భార్యను చంపిన భర్త