వైద్య సిబ్బందికి మాస్కులు లేవంటూ గతంలో వ్యాఖ్యానించి సస్పెండైన మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్‌ను.. శనివారం విశాఖపట్నంలో జాతీయ రహదారిపై గొడవ చేస్తున్నారని పోలీసులు అరెస్టు చేయడం కలకలం సృష్టించింది. సుధాకర్ గొడవ చేస్తున్నట్లు స్థానికులు చెప్పగా, పోలీసులు వెళ్లారు. పోలీసులను, ముఖ్యమంత్రిని కూడా దుర్భాషలాడటంతో అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్ మద్యం మత్తులో హల్‌చల్ చేస్తున్నారంటూ స్థానికులు 100కు ఫోన్ చేశారని పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, డీఎస్పీ ప్రశాంతి తెలిపారు.
విధులకు ఆటంకం కలిగించినందుకు వైద్యుడిపై 353, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. ఆయన్ను కొట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్ మధుబాబును సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. సుధాకర్ మానసిక పరిస్థితి బాగోలేదని కేజీహెచ్ వైద్యులు చెప్పడంతో.. పోలీసులు ఆయనను ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు. గతంలో మాస్కులు లేవని సుధాకర్ ఆరోపించడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. ఆయన్ను సస్పెండ్ చేసింది. కొద్దిరోజుల క్రితం ఆయన కుమారుడు లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి బయట తిరగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మనోవేదనతోనే ఆయన ఇలా ప్రవర్తించినట్లు చెబుతున్నారు.
ఆయన సమస్య ఇదీ: డాక్టర్ రాధారాణి
డాక్టర్ కె.సుధాకర్ ‘ఎక్యూట్ అండ్ ట్రాన్సియంట్ సైకోసిస్’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా తేలిందని ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మద్యం తాగినట్లు నిర్ధారణ అయ్యిందని, మత్తులో ఉన్న ఆయన చికిత్సకు సహకరించలేదని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున వెల్లడించారు.