అమ్మా... నేనేం పాపం చేశాను...? నీ కడుపులో పుట్టటమే నేను చేసిన నేరమా..? నెలలు నిండని నన్ను ఇంత దారుణంగా చంపుతావా..? ఆ చిన్నారికి మాటలొస్తే ఇలాగే అడిగే వాడేేమో..! కన్న పేగు మమకారాన్ని మరిచి ఓ తల్లి తన సొంత కుమారుడిని నీటి డ్రమ్ములో పడేసి అత్యంత దారుణంగా హతమార్చింది. నెలలు కూడా నిండని ఆ చిన్నారి ఆయువు తీసేసింది. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన విశాఖ జిల్లా ఏఎస్.పేటలో జరిగింది(murder in Visakhapatnam). సొంతతల్లే బిడ్డను హత్య చేయడంపై గ్రామస్థులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. తల్లి మానసిక స్థితి సరిగా లేనందునే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వైద్యుల నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. ఊహించని ఈ ఘటనతో చిన్నారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
నీటి డ్రమ్ములో మృతదేహం...
విశాఖ జిల్లా కసింకోట మండలం ఏఎస్.పేట గ్రామానికి చెందిన అప్పలరాజుకు గొండుపాలెం గ్రామానికి చెందిన సంధ్య అనే యువతితో గతేడాది నవంబర్‌లో వివాహమైంది. వీరికి మగ శిశువు జన్మించాడు. దంపతులిద్దరూ అచ్యుతాపురంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. శుక్రవారం విధులు నిర్వహించిన అనంతరం ఇంటికి వచ్చారు. భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. రాత్రి పది గంటల సమయంలో చిన్నారి ఏడుపు వినిపించింది. ఆకలేస్తుందేమోననని భావించిన సంధ్య శిశువుకు పాలు పట్టింది. అందరూ నిద్రపోతున్న సమయంలో శిశువును నీటి డ్రమ్ములో పడేసి హత్య చేసింది. దీనిని గమనించని అప్పలరాజు అర్ధరాత్రి దాటాక శిశువు కోసం వెతికాడు. చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. సంధ్యను అడగగా...పొంతన లేని సమాధానం చెప్పడంతో ఇంటి చుట్టుపక్కలా వెతికాడు. ఫలితం లేకపోవడంలో 100 నంబర్‌కు ఫోన్ చేశాడు. అప్పలరాజు ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు... సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంటి సమీపంలో గాలింపు చేపట్టగా నీటి డ్రమ్ములో శిశువు మృతదేహాన్ని గుర్తించారు.