తెదేపా, జనసేన నాయకులకు.. రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను విమర్శించారు. నాడు తెలుగుదేశం పాలనలో రైతాంగాన్ని తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టి.. నేడు రైతుల గురించి పాదయాత్ర చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
రైతులకు సూచనలు
రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇస్తున్నామని, ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేశామని సామినేని ఉదయభాను తెలిపారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు అందించి.. సూచనలు, సలహాలు అందించటం జరుగుతుందని వివరించారు.
ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుంది..
అకాల వర్షాలకు రంగుమారిన ధాన్యాన్ని ఎటువంటి నిబంధనలు లేకుండా పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తున్నామని ఉదయభాను తెలిపారు. బ్యాంకులో రుణం తీసుకున్న రైతులకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందన్నారు. రైతు ఆత్మహత్య చేసుకుంటే.. గతంలో రూ.5 లక్షలు ఇచ్చేవారని.. ఇప్పుడు దానిని రూ.7 లక్షలకు పెంచటంతో పాటు కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా మరో లక్ష రూపాయలు అదనంగా ఇస్తున్నామని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమి చేయలేని తెదేపా నాయకులు.. ఇప్పుడు రైతుల వద్దకు ఎలా వెళుతున్నారని ఆయన ప్రశ్నించారు.
ఇదీ చదవండి:
'పాదయాత్రలో అనేక హామీలిచ్చారు.. ఇప్పుడు విస్మరించారు'