సామాజిక మాధ్యమాలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉపయోగిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. వినోదం కల్పిస్తామంటూ అందమైన యువతుల ఫొటోలతో ప్రకటనలు ఇస్తున్నారు. యువకులను మెల్లగా ముగ్గులోకి దించి.. ఆ తర్వాత నగదు కోసం బెదిరిస్తున్నారు. వారి బాధితులు విజయవాడలోనూ పెరుగుతున్నారు.
ఫేస్ 'బుక్'
విజయవాడ నగరానికి చెందిన యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. నిత్యం ఫేస్‌బుక్‌ను వినియోగిస్తుంటాడు. మీకు ఆనందం కావాలంటే మాకు కాల్ చేయండి అని అందమైన యువతి ఫొటోతో ఉన్న ప్రకటన చూశాడు. వెంటనే అందులోని నంబర్‌కు ఫోన్ చేశాడు. అవతలి వైపు ఓ యువతి మత్తెక్కించే గొంతుతో మాట్లాడింది. కొద్ది రోజులు వాట్సాప్ కాల్స్, ఛాటింగ్‌లు చేసుకున్నారు. సదరు యువతి ఓ రోజు వీడియో కాల్ చేసి తన ప్రైవేట్ భాగాలను చూపించి.. యువకుడిని రెచ్చగొట్టింది. బాధితుడు సైతం నగ్నంగా వీడియో ఛాట్ చేశాడు. కాసేపటికే కాల్ కట్ అయింది. తరువాత అతని వాట్సాప్‌కు ఓ సందేశం వచ్చింది. 'నేను చెప్పిన అకౌంట్‌కు రెండు వేల రూపాయలు పంపకపోతే వీడియో ఛాట్‌ను మీ స్నేహితులు, బంధువులకు సామాజిక మాధ్యమాల ద్వారా పంపుతాం' అని బెదిరించారు. భయపడిపోయిన బాధితుడు సదరు ఖాతాకు నగదు పంపాడు. విడతల వారీగా నగదు డిమాండ్ చేయటంతో విజయవాడ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఫేస్బుక్, గూగుల్ ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేరాలు చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో నాలుగు ఫిర్యాదులు అందాయని వెెల్లడించారు.