విజయవాడలో ఇళ్ల యజమానులు భయభ్రాంతులకు గురయ్యేలా కార్పొరేషన్ ఇంటి పన్ను విధానం ఉందని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నన్ని రోజులూ.. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఎటువంటి పన్నుల భారం పడకుండా పాలించామని గుర్తుచేశారు. పాత రాజరాజేశ్వరి పేటలో సీపీఐ కార్పొరేటర్ అభ్యర్థి, ఆ పార్టీ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ తెదేపా బలపరిచిన సీపీఐ అభ్యర్థిని గెలిపించి, నగర అభివృద్ధికి తోడ్పడాలని స్థానికులను కోరారు.
పాత రాజరాజేశ్వరిపేట రైల్వే స్థలాల్లో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న పేద ప్రజలకు తామంతా అండగా ఉన్నామని ఎంపీ తెలిపారు. కార్పొరేషన్ అధికారుల వేధింపులకు పేద ప్రజలు గురికాకుండా సీపీఐ అనేక పోరాటాలు చేస్తోందని గుర్తుచేశారు. ఈ ప్రాంత ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని కార్పొరేటర్ అభ్యర్థి దోనేపూడి శంకర్ హామీ ఇచ్చారు.