దుర్గగుడిలో సుదీర్ఘకాలం బస్సు క్లీనర్‌గా పనిచేసిన లీలాప్రసాద్ అనే రెగ్యులర్ ఉద్యోగి విషయంలో ఈవో, మరికొందరు అధికారులు మోసపూరితంగా వ్యవహరించినట్టు అనిశా తనిఖీల్లో గుర్తించారు. 19ఏళ్లకు పైగా క్లీనర్‌గా పనిచేసిన లీలాప్రసాద్‌కు ఎలాంటి పదోన్నతి ఇవ్వలేదని, అర్హత ఉన్నందున ఇప్పటికైనా కండక్టర్‌గా ఇవ్వాలంటూ గతంలో పనిచేసిన ఈవోలు దేవాదాయశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు చేశారు. దీంతో 2020 జనవరిలో అతనికి పదోన్నతి కల్పించాలంటూ కమిషనర్ లేఖ రాశారు. ఈ విషయంపై లీలాప్రసాద్ ఈవోను కలిశారు. తనకు కండక్టర్‌గా పదోన్నతి కల్పించేందుకు అవసరమైన లైసెన్స్ కూడా ఉందని తెలియజేశారు.
కానీ.. అతడికి ఉన్న లైసెన్స్ కాలపరిమితి తీరిపోయిందని, పదోన్నతికి అర్హుడు కాడంటూ కమిషనర్‌కు ఈవో లేఖ పంపారు. ఇప్పుడు ఇదే వివాదంగా మారింది. 2020 మేలో లీలాప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందారు. చనిపోయే వరకు తన పదోన్నతి కోసం ఈవో చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పదోన్నతికి సంబంధించి నివేదిక తనిఖీల్లో గుర్తించినట్టు తెలిసింది. దీనిపై లీలాప్రసాద్ భార్యను పిలిచి ఏసీబీ అధికారులు విచారించారు. తన భర్తకు పదోన్నతి ఇవ్వాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని అడిగారని, అంత ఇచ్చుకోలేమన్నందుకే.. వేధింపులకు గురిచేశారంటూ ఆమె చెప్పినట్టు సమాచారం.
వాస్తవంగా లీలాప్రసాద్‌కు కండక్టర్ లైసెన్స్ గడువు 2020 చివరి వరకు ఉండగా, అంతకుముందే అయిపోయిందంటూ ఈవో రాసి పంపించిన విషయం ఆధారాలతో సహా గుర్తించారు. అర్హుడైన ఓ ఉద్యోగి జీవితాన్ని చిన్నాభిన్నం చేసేలా మోసపూరితంగా ఎందుకు వ్యవహరించారనే విషయంపై ప్రస్తుతం అధికారులు దృష్టి సారించినట్టు తెలిసింది. ఏసీబీ అధికారులు పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేశాకే.. దీనిపై మరింత స్పష్టత వస్తుంది.